Rajamahendravaram To Delhi Direct Flight Started : రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి నేరుగా తొలి విమాన సర్వీస్ ప్రారంభమైంది. అంతకు ముందు దిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది. తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari), కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చారు.
రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్‌కు వాటర్ క్యానన్తో సిబ్బంది స్వాగతం పలికారు. ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇటీవల రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాలతో రాజమహేంద్రవరం అనుసంధానమైందని ఆనందం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి భవిష్యత్తులో మరిన్ని విమానాలు అందుబాటులోకి తెస్తామన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో విమాన సర్వీసులు పెరిగాయని వివరించారు. విమానాల ద్వారా రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు.
రాజమహేంద్రవరానికి ఇది మరచిపోలేని రోజు : ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి ఇది మరచిపోలేని రోజని, జిల్లావాసులకు వివిధ ప్రాంతాలతో అనుసంధానం ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులో తిరుపతి, షిర్డీ, అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని పురందేశ్వరి తెలిపారు.
కడప వాసులకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణ