Young Man Died Due to Lightning : పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందిన విషాదకర ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో చోటు చేసుకుంది. పొలంలో వరి విత్తనాలు చల్లి తిరిగి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో యువకుడు వడ్డాది భవానీ శంకర్ (22) తో పాటు తల్లిదండ్రులు ఓ పశువుల పాకలోకి వెళ్లారు. ఈ సమయంలో ఎదురుగా ఉన్న పశువుల పాకపై పిడుగు పడింది.
సెల్ఫోన్ చూస్తుండగా యువకుడు మృతి: అదే సమయంలో భవానీ శంకర్ సెల్ ఫోన్ చూస్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. తక్షణమే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువకుడు భవాని శంకర్ మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు పిడుగుపాటుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు. అయితే ఈ సంఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలుస్తుంది.
పాఠశాలకు వెళ్లేందుకు ఇక్కట్లు: వర్షం వస్తే తమ గ్రామం నుంచి దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు ఇక్కట్లు పడుతున్నామని, అక్కడ ఉపాధ్యాయులలో ఒకరిని పంపించాలంటూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తెంగిళ్లబంధం గ్రామానికి చెందిన విద్యార్థులు వర్షాకాలం వస్తే స్కూలుకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంగిళ్లబంధానికి చెందిన 25 మంది విద్యార్థులు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు.
వీరంతా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగవరంలోని ఎంపీపీ పాఠశాలలో చదువుతున్నారు. అయితే గంగవరంలో ఉన్న స్కూలు వెళ్లే దారిలో పెద్ద గెడ్డ ఉంది. వర్షం వచ్చిందంటే ఈ గెడ్డ పొంగుతుంది. దీనివల్ల తెంగిళ్లబంధానికి చెందిన 25 మంది విద్యార్థులు స్కూలుకు వెళ్లలేకపోతున్నారు. ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, గంగవరంలో ఉన్న టీచర్లలో ఒకరిని తెంగిళ్లబంధం పంపిస్తే ఈ కష్టాలు తీరతాయని విద్యార్థులు అంటున్నారు.
ఇప్పటికే అనేకసార్లు తమ పిల్లలు ఇబ్బందులకు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. చాలాసార్లు బడి మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి గడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉపాధ్యాయుడిని కేటాయిస్తే మా గ్రామంలో షెడ్డు నిర్మించుకుంటామని వారంతా ప్రాధేయపడుతున్నారు.
వాహనదారుల ఇబ్బందులు: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వం రహదారులను విస్మరించడంతో ఆ ప్రభావం ప్రస్తుతం వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా ఉంది. రహదారుల గుంతలలో వర్షం నీరు నిలిచిపోయి, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు - నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - Rain Effect in AP