RainAlert Updates in Telangana : పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఆవర్తనం గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా వద్ద సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
ఈ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీయనున్నాయి.
అలుగుపారుతున్న బయ్యారం పెద్ద చెరువు : ఈ ఆవర్తనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. పలు చెరువుల మత్తడి తొక్కుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువు అలుగు పారుతోంది. మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి.
జిల్లాలో ఎల్లో అలర్ట్ : గార్ల మండల కేంద్రం శివారు పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ మండలం పెసర బండ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరుకోవడంతో విద్యార్థులను ఇంటికి పంపించారు. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ అధికారులు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ వానలు పంటలకు ఎంతో దోహదపడతాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్