Rain Alert for Andhra Pradesh: ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో భయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండల ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత నుంచి కొద్ది రోజులు అయినా ఉపశమనం లభిస్తుంది ఏమో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఎండల నుంచి కాస్తంత ఉపశమనం లభించబోతోందనే వార్తనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్టు వెల్లడించింది.
కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లోనీ మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందనీ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఎల్లుండి కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో 6 నుంచి 12 సెం.మీ. వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్లు, విద్యుత్ స్థంబాల క్రింద ఉండకూడదని పేర్కొన్నారు. పొలాలు, మైదానాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.
ఈ టిప్స్ పాటిస్తే - సమ్మర్లో కూడా మొక్కల పెరుగుదల సూపర్!
తెలంగాణలో నేటి నుంచే: తెలంగాణలో సోమవారం నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ‘పసుపు’ రంగు హెచ్చరిక సైతం జారీ చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. వర్షాలు పడే జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, రవాణా వ్యవస్థ స్తంభించడం, చెట్లు పడిపోవడం, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికల్లో పేర్కొంది.
కనిగిరిలో దాహం కేకలు- గుక్కెడు నీళ్లు కోసం ప్రజలు నానా అవస్థలు
మంచు కురిసే వేళ డ్రైవింగ్ చేస్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే!