Ban on lighting camphor in trains : దక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని స్పష్టం చేసింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖ, విజయవాడ, అనంతపురం జిల్లాల నుంచి శబరిమలకు రైళ్లు బయల్దేరుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించే రైళ్లు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతుంటాయి.
సుదీర్ఘ ప్రయాణం కలిగిన ఈ రైళ్లలోనే అయ్యప్ప భక్తులు పూజలు కూడా చేస్తుంటారు. జంక్షన్లలో రైళ్లు నిలిచినపుడు స్నానాలు ముగించుకుని అలంకరణ చేసుకున్న తర్వాత హారతి తీసుకుంటారు. ఈ క్రమంలో ప్రతి బోగీలోనూ గురుస్వాములు కర్పూర హారతి వెలిగిస్తుంటారు. అయితే కర్పూరం వెలిగించొద్దని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అయ్యప్ప కొండకు వెళ్దామా! - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా 62 రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని స్పష్టం చేసింది. అయ్యప్ప భక్తులు యాత్రలో భాగంగా కోచ్‌ల లోపల పూజలు చేసే క్రమంలో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వంటివి చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని రైల్వే తెలిపింది. ప్రమాదాలకు అవకాశమిచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని ప్రయాణికులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే లక్షలాది యాత్రికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు జోన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ తదితర స్టేషన్ల నుంచి బయలుదేరతాయి. ఆయా ప్రాంతాల నుంచి వెళ్లే భక్తులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేందుకు రైల్వే శాఖ ప్రయాణికుల సహకారం ఆశిస్తోంది. రైళ్లు, రైలు ప్రాంగణాల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేస్తోంది. మండే స్వభావం కలిగిన కర్పూరం, అగ్గిపెట్టెలు, అగరుబత్తులు తదితర పదార్థాలతో ప్రయాణం చేయడం నిషిధించినట్లు తెలిపింది. ముఖ్యంగా బోగీల్లో కర్పూరం వెలిగించడం నిషేధించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
మండే స్వభావం కలిగిన పదార్థాలు అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయని, తద్వారా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. రైల్వే ఆస్తులకు సైతం నష్టం కలిగించే అవకాశం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే రైల్వే చట్టం-1989లోని సెక్షన్లు 67, 154, 164, 165 ప్రకారం నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేస్తోంది. అగ్ని ప్రమాదాలకు కారకులైన వారు నష్టానికి బాధ్యత వహించడంతోపాటు, 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా? భక్తులు ఈ హెల్త్ టిప్స్ పాటించాల్సిందే!