Railway Loco Pilot Brutally Murdered in Vijayawada : విధి నిర్వహణలో ఉన్న రైల్వే లోకో పైలెట్ దారుణ హత్య విజయవాడలో తీవ్ర కలకలం రేపుతోంది. నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోనే ఈ హత్య జరగడం ఉద్యోగులు, స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయవాడకు చెందిన డి. ఏబేలు(52) రైల్వే షంటింగ్ లోకో పైలెట్‌గా పని చేస్తుంటారు. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఎఫ్ క్యాబిన్ మధ్య బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో (అక్టోబర్ 9న) విధి నిర్వహణలో ఉండగా గుర్తు తెలియని ఆగంతకుడు ఇనుప రాడ్డుతో ఆయన తలపై బలంగా కొట్టారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే రైలు పట్టాలపై పడిపోయారు.
మరో షంటింగ్ లోకో పైలెట్ పృథ్వీరాజ్ చూసి బాధితుడిని వెంటనే రైల్వే సిబ్బంది సహాయంతో సమీపంలోని రైల్వే ఆసుపత్రికి హుటహుటిన తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ గురువారం (అక్టోబర్ 10న) తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందారు. ఆగంతకుడు డబ్బు లేదా ఏదైనా విలువైన వస్తువుల కోసం హత్య చేశారా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియడం లేదు. లోకో పైలెట్ దారుణ హత్యలో బ్లేడ్ బ్యాచ్ లేదా గంజాయి బ్యాచ్ అనే విషయం తెలియడం లేదు. ఆగంతకుడు నడుస్తూనే ఒక్కసారిగా జనాలపై ఇనుపరాడ్డుతో తలపై మోదుతున్నాడనే అనుమానాలు వస్తున్నాయి.
స్వామీజీపై నమ్మకమే ప్రాణాలు తీసేలా చేసింది- విషాదాంతంగా సీఐ తల్లి మిస్సింగ్ కేసు
సైకోగా పోలీసుల అనుమానం : గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు 4 వేర్వేరు రైల్వే ప్రదేశాల్లోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. నగరంలోని నైజాం గేట్ సెంటరులో ఓ రైల్వే కార్మికుడిపై కూడా దాడి జరిగినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోనూ ఇదే తరహాలో వ్యక్తిపై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. కృష్ణలంక సమీపంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో రైల్వే బ్రిడ్జిపై ఆగంతకుడు దాడికి పాల్పడుతున్న తరుణంలో పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన స్థలానికి పోలీసులు వచ్చేలోపే విజయవాడ రైల్వేస్టేషన్‌వైపు పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు సైకోగా భావిస్తూ రైల్వే పరిసరాల్లో పటిష్ఠ భద్రత చర్యలు తీసుకున్నారు. రైల్వే పరిసరాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి, మరో 3 ప్రాంతాల్లో దాడికి పాల్పడినది ఒకరేనా అనేది రైల్వే పోలీసులకు అంతుపట్టడం లేదు. దీంతో రైల్వే పోలీసు ఉన్నత అధికారులు రంగంలోకి దిగారు.
మన్యం టేకు తోటల్లో మర్డర్ - క్లూ వదిలేసిన నిందితులు - Murder case
రెండు ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు : నిందితుడిని పట్టుకునేందుకు రైల్వే పోలీసులు 2 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సమీప పరిసరాలను జల్లెడ పడుతున్నారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో జీఆర్పీ సిబ్బంది నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను బట్టి నిందితుడికి మానసికస్థితి సరిగా లేదని భావిస్తున్నామని జీఆర్పీ జె.వి.రమణ తెలియజేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మరోవైపు లోకో పైలెట్‌పై దాడి సంఘటనపై రైల్వే కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న రైల్వే సిబ్బందికి తక్షణమే భద్రత కల్పించాలని ఆలిండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జోనల్ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.