Flood Water into Palamuru-Rangareddy Project Pump House : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం జలాశయం వద్ద నిర్మించిన పంపు హౌజ్ నీట మునిగింది. రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపురం, నాగర్ కర్నూల్, నాగనూలు చెరువుల నుంచి భారీగా వరద దిగువకు వెళ్తోంది. పంప్ హౌజ్‌లోకి వెళ్లేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసుకున్న ఆడిట్ల నుంచి ఈ వరద నీరు సొరంగ మార్గంలోకి భారీ ఎత్తున చేరింది. దీంతో వట్టెం వద్ద నిర్మించిన పంపు హౌజ్ మునకకు గురైంది.
మొత్తం 10 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికి నాలుగు పంపుల్ని సిద్ధం చేశారు. ఐదో పంపు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. సొరంగం మార్గంలోకి భారీ ఎత్తున నీరు చేరిన నేపథ్యంలో పంపు హౌజ్ పనుల్ని నిలిపివేశారు. ప్రస్తుతం మోటార్లతో నీళ్లెత్తి పోసే పనులు కొనసాగుతున్నాయి. సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర ఉండే ఈ సొరంగ మార్గం ద్వారా సర్జ్ పూల్ సహా, పంపు హౌజ్ ను వరదనీరు ముంచెత్తింది. నిర్మాణంలో ఉన్న పంపుహౌజ్ పూర్తిగా నీటమునిగింది. సొరంగ మార్గం నుంచి నీటిని బైటకు తోడివేసే ప్రక్రియను నీటి పారుదల అధికారులు చేపట్టారు.
పై నుంచి నీరు రావడంతో తోడడానికి ఆటంకం : అయినా శ్రీపురం వైపు నుంచి వచ్చే వరద ఆగకుండా సొరంగ మార్గంలోకి రావడంతో నీటి తోడివేత ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. పై నుంచి వచ్చే వరద ఆగితే తప్ప తోడివేత వేగం పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. వట్టెం జలాశయం పంపు హౌజ్‌లో 10 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం నాలుగు పంపులు ఏర్పాటు చేశారు. మిగిలిన పంపుల ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి.
నీరు చేరడంతో ప్రస్తుతం అక్కడి పనుల్ని నిలిపివేశారు. సొరంగం సహా పంపుహౌజ్‌లోకి పెద్ద ఎత్తున నీరు చేరిన నేపథ్యంలో నీటి తోడివేతకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టేలా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. పెద్ద నష్టం ఏమీ ఉండదని, నీటి తోడివేత అనంతరం పంపుల్ని శుద్ధి చేసుకుని తిరిగి వినియోగించుకుంటామని వెల్లడించారు.
లక్ష్మీ బ్యారెజ్‌కు భారీగా వరద నీరు : మరోవైపు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్‌కు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన వర్షాలతో లక్ష్మీ బ్యారేజీకి 8,52,240 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఈ క్రమంలో బ్యారేజీలోని 85 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే అన్నారం బ్యారెజీకి కూడా 3,92,543 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండటంతో 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిండుకుండల్లా మారిన జలాశయాలు - భారీ వర్షాలతో సంతరించుకున్న జలకళ - Huge Floods in Dams