Police Inquiry on Viveka PA Compliant : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసిన విషయం తెలిపిందే. ఈ కేసుపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సందర్భంలో సాక్షులుగా ఉన్న పలువురికి పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే నోటీసులు అందుకున్న ఆరుగురు ఇవాళ డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వారిలో ప్రధానంగా జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ తరపు న్యాయవాది ఓబుల్‌రెడ్డి, కృష్ణారెడ్డి కుమారుడు రాజేశ్‌కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే రఘునాథ్‌రెడ్డి, ఆ పార్టీ కార్యకర్త భరత్‌యాదవ్, వీఆర్వో మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.
గతేడాది డిసెంబర్ 15న సునీత దంపతులు, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పైన కేసు నమోదైంది. ఈ అంశంపై తిరిగి ఫైనల్ ఛార్జిషీట్ పులివెందుల కోర్టులో దాఖలు చేయడానికి పోలీసులు పలువురు సాక్షులను విచారిస్తున్నారు. అయితే మరో నలుగురు విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిలో వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డిని రెండు వారాల కిందటే డీఎస్పీ విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. ఇవాళ మరోసారి ఆయన డీఎస్పీని కలిసి వెళ్లారు.
YS Viveka Murder Case Updates : డీఎస్పీ మురళీ నాయక్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు న్యాయవాది ఓబుల్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గతంలో దర్యాప్తు సంస్థలను ఏ ప్రశ్నలు అడిగారో వాటిని మళ్లీ అడిగినట్లు చెప్పారు. వాటికి కూడా ఆన్సర్స్ ఇచ్చినట్లు తెలిపారు. వాటన్నింటిని ఆడియో, వీడియో రికార్డ్ చేశారని తెలిపారు. తనకు తెలిసిన విషయాలను డీఎస్పీకి చెప్పానని న్యాయవాది ఓబుల్‌రెడ్డి వెల్లడించారు.