Ration Distribution System in AP : దశాబ్దాలుగా సాఫీగా సాగిపోతున్న రేషన్ సరఫరా వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుదిపేసింది. ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాలతో హైరానా చేసింది. ఇకపై ఇంటివద్దే రేషన్ తీసుకోచ్చనుకున్న లబ్ధిదారుల ఆశలకు సమస్యలు కళ్లెం వేశాయి. ఎక్కడో వీధి చివరన వాహనం ఆగితే అక్కడి దాకా వెళ్లాల్సి రావడం తలనొప్పిగా మారింది. వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియకపోవడం పనులు మానుకొని ఎదురుచూడటం రాకపోతే ఉసూరుమనడం సర్వసాధారణంగా మారిపోయాయి.
సాంకేతిక సమస్యలు తలెత్తి పరికరాలు పని చేయకపోయినా ఆ పాపం లబ్ధిదారులపైనే పడుతోంది. ఒకవేళ రేషన్ వాహనం వచ్చినప్పుడు ఇంటివద్ద లేకపోతే ఆ నెల రేషన్ కోల్పోవాల్సిందే. అధిక ధరలకు బయట కొనాల్సిరావడం ఆర్థిక భారాన్ని పెంచింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే వెయ్యి రేషన్ దుకాణాల ద్వారా 338 ఎండీయూ (MDU-Mobile Dispensing Unit) వాహనాలతో 5,33,288 మంది కార్డుదారులకు సరకులు పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంతో విసిగిపోయిన ప్రజలు పాత విధానాన్నే తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
2021 ఫిబ్రవరిలో ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమం జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఒక్కొక్కటీ 7 లక్షల రూపాయల చొప్పున 10,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలను కొనుగోలు చేసింది. ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నామని గొప్పలు పోయిందే తప్ప ప్రజలు, రేషన్ డీలర్ల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదు. డీలర్ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వీలున్నప్పుడు వెళ్లి రేషన్ దుకాణానికి వెళ్లి సరకులు తెచ్చుకునే వెసులుబాటు ఉండేదని కార్డుదారులు చెబుతున్నారు. వాహనాల వ్యవస్థ వచ్చాక గందరగోళం మొదలైంది. ఇంతకుముందు బియ్యంతోపాటు, గోధుమపిండి, కందిపప్పు, వంటనూనె, చక్కెర వంటి నిత్యావసరాలను తక్కువ ధరకే ఇస్తుండగా వైఎస్సార్సీపీ సర్కారు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తూ వచ్చిన క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాలను కనుమరుగు చేసింది.
"రేషన్ వాహనం వచ్చే సమయానికి మేం ఉంటే తీసుకుంటాం. లేకపోతే లేదు. అధిక ఖర్చు చేసి బయట కొనవలసిన పరిస్థితి. రేషన్ వాహనం ఏ టైంకు వస్తుందో తెలియదు. వీటి కోసం మేము పనులకు వెళ్లకుండా ఉండాలి. ఈ వాహనం ద్వారా రేషన్ పంపిణీ అయ్యే ఖర్చును నిత్యావసర వస్తువులను అధికంగా ఇస్తే మాకు ఆర్థిక భారం తగ్గుతుంది. గత ప్రభుత్వ హయాంలో బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర లాంటివి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం" -రేషన్ లబ్ధిదారులు
రాష్ట్రంలో 29,795 మంది రేషన్ డీలర్లు ఉండగా ఒక్కో ఎండీయూ వాహనానికి 2, 3 రేషన్ షాపులను అధికారులు కేటాయించారు. ఒక్కో వాహనానికి ఆపరేటర్, డీలర్, హమాలీ, వీఆర్ఓలను బాధ్యులుగా ఉంచారు. డీలర్‌కు కమీషన్ ఇస్తే సరిపోయేది కానీ ఈ ఎండీయూ వాహనాల ద్వారా ప్రభుత్వంపై ఆదనపు ఆర్ధిక భారం పడుతోంది. 90% రాయితీతో ఎండీయూ ఆపరేటర్‌కి వాహనాలను అందించంతో పాటు వారికి నెలవారీ వేతనంగా రూ. 10 వేలు చెల్లిస్తున్నారు. వాహనంతో ఉండే హమాలీకి నెలకు 5 వేలు, పెట్రోల్ ఖర్చులకు మరో 3 వేల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది. నెలకు ఒక్కో వాహనంపై 18 వేల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతోందా అంటే అదీ లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానం వల్ల కార్డుదారులతో పాటు తామూ తీవ్రంగా నష్టపోతున్నామని రేషన్ డీలర్లు వాపోతున్నారు.