Public Grievances At TDP Party Office in Mangalagiri : కడుపున పుట్టిన కొడుకులే కనికరించడం లేదని, తమ పేరుపై ఉన్న భూమిని ఫోర్జరీ సంతకాలతో కాజేసి అనంతరం దాడి చేశారని ఓ బాధితురాలు టీడీపీ నాయకుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏం చేయాలో తోచక అన్న క్యాంటీన్లో భోజనం చేసి బతుకుతున్నానని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని గుమ్మనంపాడు గ్రామానికి చెందిన ముక్కపాటి రాజ్యం టీడీపీ నాయకులకు ఫిర్యాదు చేసింది.
అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎమ్మెల్సీ చిరంజీవి, నాయకుడు పీలా గోవింద్ మంగళవారం అర్జీలు స్వీకరించారు.
టీడీపీ కార్యాలయంలో వినతుల వెల్లువ : అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్నామని గెస్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 100 మందికి పైగా గెస్ట్ లెక్చరర్లు (Guest Lecturers) అర్జీ అందించారు. 2002లో కొనుగోలు చేసిన భూమిపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేయాలని అబ్బూరి శేషయ్య, చావా హరికృష్ణ ప్రయత్నిస్తున్నారని ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన ముప్పరాజు వెంకటేశ్వర్లు వాపోయారు. తమ పిల్లలు అమెరికాలో ఉండటంతో ఆయనను చంపి ఆస్తి కొట్టేయాలని కుట్రపన్నారని తెలియజేశారు. వారి నుంచి ప్రాణహాని ఉందని టీడీపీ నాయకులకు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్సీపీ నాయకులు వేధిస్తున్నారు - మంత్రి లోకేశ్ బాధితుల మొర - Nara Lokesh Praja Darbar
ఆర్థిక సాయం చేసి చికిత్స చేయించాలని : కరోనా సమయంలో ఇన్ఫెక్షన్ సోకి రెండు కళ్లు పోయాయని ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన రామదేవులపాడు గ్రామానికి చెందిన నూతలపాటి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు గుండె సమస్య కూడా ఎక్కువైందని, ఆర్థిక సాయం చేసి చికిత్స చేయించాలని వేడుకున్నారు. వారసత్వంగా వచ్చిన భూమి కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారని ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిన్నగుడిపాడుకు చెందిన సుబ్బమ్మ అర్జీ అందించారు. అందులో సగం భూమి ఇతరుల పేరుపై నమోదయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు బలైపోయాం - న్యాయం చేయండి - జనసేన కార్యాలయానికి క్యూ కట్టిన బాధితులు
న్యాయం చేయాలని విజ్ఞప్తి : తన భూమికి కొందరు దొంగ పత్రాలు సృష్టించి పాసు పుస్తకాలను రద్దు చేయించారని నెల్లూరు జిల్లా భీమవరప్పాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సహకరించిన అధికారులతో సహా అందరిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తమ గ్రామంలోని రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కొండూరు గ్రామ రైతులు అర్జీ అందించారు. రోడ్లుకు వెంటనే మరమ్మతుల పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వారసత్వంగా వచ్చిన భూమిని గ్రామ సర్పంచితో అధికారులు కుమ్మక్కై ఇతరులకు పట్టా చేయించారని బాధితులు వాపోయారు. తన భూమి తిరిగి ఇప్పించాలని ఏలూరు జిల్లా మైసన్నగూడేనికి చెందిన బాధితురాలు కోరారు.
ఆళ్ల నాని పరిహారం అందకుండా చేశారు - మంత్రి లోకేశ్‌కు బాధితుడి మొర - Lokesh Praja Darbar 17th Day