Public Grievance at TDP Office: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ సుజయ కృష్ణరంగారావు వినతులు స్వీకరించారు. పంచాయతీలో పనులు చేయకుండానే తప్పుడు రికార్డులు సృష్టించి గ్రామ సర్పంచి, కొంతమంది అధికారులు సుమారు 70 లక్షల ప్రజాధనాన్ని కాజేశారని అన్నమయ్య జిల్లా, వీరబల్లి మండలానికి చెందిన పలువురు తెలిపారు.
శివాలయం కోసం కేటాయించిన భూమి కబ్జా: శివాలయం నిర్మాణం కోసం కేటాయించిన భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేశారని ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన 5 సెంట్ల భూమిని శ్రీనివాసరావు అనే వ్యక్తి కబ్జా చేశాడని పల్నాడు జిల్లా ముప్పాళ్లకు చెందిన డేనియల్ ఫిర్యాదు చేశారు.
కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని పింఛన్ కట్: విద్యుత్తు బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో గత ప్రభుత్వం నిలిపేసిన పింఛన్‌ను పునరుద్ధరించాలని బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన రామచంద్రారావు కోరారు. గత ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసుల్ని ఎత్తేయాలని డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన కొల్లు నరసింహారావు వినతిపత్రం అందజేశారు.
50 లక్షల కట్నం డిమాండ్ చేస్తున్నాడు: పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం వరకు వచ్చి, ఇప్పుడు 50 లక్షలు కట్నం డిమాండ్ చేస్తున్న షరీఫ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లాకు చెందిన కరిష్మా అనే మహిళ విజ్ఞప్తి చేశారు. దేవాదాయశాఖలో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ప్రతినిధులు కోరారు. ఇప్పటికీ భూ ఆక్రమణలపై ఫిర్యాదులు తగ్గట్లేదు. తమ భూమిని వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించారంటూ నేడు కూడా పలువురు ఫిర్యాదు చేశారు.
'వారసత్వ భూములను కబ్జా చేశారు - ప్రశ్నిస్తే హత్యాయత్నం'
'వైఎస్సార్సీపీ నేతల అండతో భూములు కబ్జాచేసి మాపై దాడులు చేసారు'