International Drug Gang Arrested in Hyderabad : రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరో చేధించిన అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ కేసులో ప్రముఖుల లింకులు బయపడుతున్నాయి. వినియోగదారుల్లో పబ్ యజమానులు, ఐటీ కంపెనీల అధినేతలు, రియల్టర్ల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో ప్రముఖులుగా చలామణీ అవుతున్న వీరి మత్తు బాగోతాలు పోలీసుల్ని నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి. నైజీరియన్ల నుంచి వీరంతా తరచూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
దేశ వ్యాప్తంగా కొకైన్ వంటి డ్రగ్స్ సరఫరా చేసే కీలక అంతర్జాతీయ ముఠాను పట్టుకున్న పోలీసులు వారి నుంచి కొనుగోలు చేస్తున్న వినియోగదారుల చిట్టా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లు సహా మొత్తం ఐదుగురిని టీజీన్యాబ్ అధికారులతో కలిసి నార్సింగి పోలీసులు ఆరెస్ట్ చేయగా ఉప్పరపల్లి కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.
నటి రకుల్ సోదరుడు : దీంతో నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు. వీరి నుంచి కొకైన్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులను పోలీసులు గుర్తించారు. వినియోగదారులను సైతం కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసులకు చిక్కిన ఐదు మంది వినియోగదారులు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్, అంకిత్ రెడ్డి, మధుసూదన్, ప్రసాద్, నిఖిల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పబ్ నిర్వహిస్తూ డ్రగ్స్ దందా : పట్టుబడిన వినియోగదారుల్లో అందరూ విలాసవతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారే ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన ప్రధాన నిందితుల నుంచి నగరంలోని అనేక ప్రాంతాల్లోని ప్రముఖులు, ధనవంతులకు డ్రగ్స్ చేరుతున్నట్లు దాదాపు 30 మందికి పైగా వీరి నుంచి డ్రగ్స్ కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరం సహా ఇతర ప్రాంతాల్లో దాదాపు ఏడుకు పబ్బులకు యజమానిగా ఉన్న నిఖిల్ ధావన్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. నిఖిల్ ధావన్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పబ్బులు ఉన్నట్లు గుర్తించారు. నిత్యం దేశ, విదేశాలు తిరిగే ఇతడికి ప్రముఖులకు సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
డ్రగ్స్ వినియోగదారుల్లో ఒకరైన మధురాజు ప్రముఖ ఐటీ సంస్థ యజమాని అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అమన్ కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు గుర్తించారు. ఇంకో ఇద్దరు రియల్టర్లు ఉన్నట్లు తేలింది. వీరంతా సొంతంగా డ్రగ్స్ వినియోగించడంతో పాటు పబ్బులు, హోటళ్లలో పార్టీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన సూత్రధారులు అల్లం సత్య వెంకట గౌతమ్, శానబోని వరుణ్ కుమార్, మహ్మద్ షరీఫ్ నుంచి డ్రగ్స్ కొని స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్నారు. ఈ పార్టీలకు ఎవరెవరు హాజరవుతున్నారు, డ్రగ్స్ ఇంకా ఎక్కడికి చేరుతున్నాయో అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు ఫోన్ల డేటా ద్వారా అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
మహిళ స్టోరీ విని పోలీసులే షాక్ : ఈ కేసులో అరెస్టయిన నైజీరియన్ యువతి ఒనోహా బ్లెస్సింగ్ దందా చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. పదో తరగతి చదివి ఉపాధి కోసం 2018లో ముంబయి వచ్చిన ఈమె బెంగళూరుకు మకాం మార్చింది. హెయిర్ స్టైలీష్‌గా పని చేస్తున్న ఈమెను స్థానిక డ్రగ్ పెడ్లర్లు గుర్తించి చిన్నమొత్తాల్లో సరఫరా చేయించేవారు. ఆ తర్వాత డ్రగ్ డాన్ సూజీ ఆదేశాల ప్రకారం ఈమె ఆఫ్రికా దేశాల నుంచి దిల్లీ, హైదరాబాద్‌కు డ్రగ్స్ చేరవేసే స్థాయికి చేరింది. డ్రగ్స్ తీసుకొచ్చినందుకు స్థానిక సరఫరాదారులకు చేర్చినందుకు ఇలా రెండు వైపులా కమీషన్ తీసుకుంటోంది. 2019లో ఒక డ్రగ్స్ కేసులో అబ్కారీ పోలీసులు బ్లెస్సింగ్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాపారం చేస్తోన్న వెంకట గౌతమ్, వరుణ్ కుమార్, మహ్మద్ మత్తు పదార్థాల సరఫరాకు కొరత రాకుండా ఉండేందుకు బ్లెస్సింగ్‌కు ముందుగానే డబ్బు నమకూర్చి నగరానికి తెప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో సింథటిక్ డ్రగ్స్ విక్రయాల్లో ఈ ముగ్గురు కీలకపాత్ర పోషిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. గౌతమ్ అనే వ్యక్తి గత ఏడు నెలల్లో 2.7 కొకైన్ విక్రయించాడు అంటే వీరికి ఏ స్థాయిలో వ్యాపారం ఉందో అర్థం చేసుకోవచ్చు.