Problems of Vijayawada hill dwellers: ఏళ్లు గడుస్తున్నా విజయవాడలోని కొండ ప్రాంత ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడుతున్నారు. సరైన రహదార్లు లేక కొండవాలు ఎక్కలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో తమ గోడును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆలకించిన పాపాన పోలేదంటున్న కొండ ప్రాంత వాసులు కొత్త ప్రభుత్వమైనా సమస్యల్ని పరిష్కరిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
వందల అడుగుల ఎత్తున కొండ వాలులో ఇళ్లు కట్టుకుని నివసించడం అంత తేలికైన విషయంకాదు. భౌగోళిక పరిస్థితుల రీత్యా విజయవాడలోని పలు డివిజన్లలో 150 నుంచి 250 మెట్లకు పైఎత్తులో ప్రజలు జీవిస్తున్నారు. వేలల్లో అద్దెలు భరించలేక వేలాదిమంది కొండపై ఇళ్లను నిర్మించుకున్నారు. అంత ఎత్తులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. వర్షాల వేళ ఎక్కడ కొండచరియలు విరిగిపడతాయో అని నిత్యం భయం గుప్పిట్లో గడపాల్సిన దుస్థితి.
సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు - కనీస వసతుల్లేకుండా ఎలా ఉండాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం
వర్షం కురిసినప్పుడు మట్టి, రాళ్లు ఇళ్లపై జారిపడిన ఘటనలు కోకొల్లలు. ఇక తుపాన్లు, భారీ వర్షాల సమయంలో అడుగు తీసి భయట పెట్టాలంటే సాహసమనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో మెట్లు లేక పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. పైపుల సామర్థ్యం తగ్గిపోవడంతో అరకొరగా నీరందుతోంది. సమస్యల్ని పరిష్కరించాలని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం కన్పించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ కొండ ప్రాంత వాసుల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అపరిష్కృతంగా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా వారి ఇబ్బందులు తీరడం లేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు కొండ ప్రాంత నివాసితులకు పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. కొన్నిచోట్ల పట్టాల వరకు పంపిణీ చేసి మమా అనిపించేశారు. వాటిని తీసుకుని రుణం కోసం వెళ్తే రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తామని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. దీంతో పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు ఇళ్లు తనఖా పెడదామన్నా అవకాశం లేకుండా పోయింది. గత ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పి ఐదేళ్లు కాలం గడిపేసింది కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని స్థానికులు మండిపడుతున్నారు.