Problems of Handloom Weavers in AP : రాష్ట్రంలోని చేనేత కుటుంబాల్ని పలకరిస్తే కొందరు హోటళ్లలో పనికి వెళ్తుంటే ఇంకొందరు పొట్టకూటి కోసం కూలికి పోతున్నారు. మగ్గానికి మహర్దశ తెస్తామంటూ మభ్యపెట్టిన జగన్ అధికారంలోకి రాగానే నేతన్నల వెన్నువిరవడమే ఈ దుస్థితికి కారణం! పట్టు మగ్గాలకు ఇస్తున్న రాయితీని ఎత్తేశారు. నేత చీరలకు మార్కెటింగ్ సహకారం అందకుండా చేశారు. ముడి సరకు ధరలు పైపైకి ఎగబాకుతున్నా కట్టడి చేయలేదు.
'చేనేత' ఇక గతమేనా?- మగ్గం నేసిన చేతులు మట్టి పనుల్లో!
గత ఎన్నికల్లో వడ్డీలేని రుణాలు అందిస్తామన్న హామీపైనా జగన్ నాలుక మడతేశారు. ఆఖరుకు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే వారికి కొత్తగా పింఛన్ మంజూరు చేసేందుకూ నిబంధనల కొర్రీలు వేశారు. సొంత మగ్గాలున్న వారికి ఏడాదికి ఒకసారి నేతన్న నేస్తమంటూ బటన్ నొక్కడమే తప్ప వృత్తి రీత్యా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదు. ఈ కళ తమతోనే అంతరించిపోతుందేమో అని నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.
కులవృత్తిని వీడి కూలి పనులు : వైసీపీ ప్రభుత్వ విధానాలతో చేనేత పరిశ్రమ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. నేతన్నలను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన జగన్ అరకొరగా నేతన్న నేస్తం ఒక్కటే ఇస్తూ తెలుగుదేశం ప్రభత్వ హయాంలో అమలు చేసిన పలు పథకాలు, రాయితీలకు మంగళం పాడేశారు. దీంతో ఆదాయం లేక కుటుంబ పోషణ కష్టమై నేతన్నలు కులవృత్తిని వీడి కూలి పనులు, టీ దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
చేనేతకు ‘మర’ పగ్గం!...యూనిఫాం కొనుగోలులో నిబంధనల బేఖాతరు
ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగటంతోపాటు తయారైన చీరకు ఆమేరకు మార్కెట్లో ధర లేకపోవటంతో వస్త్ర ఉత్పత్తిదారులు కార్మికులకు సరైన పని కల్పించలేకపోతున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, భట్టిప్రోలు, కనగాల, ఐలవరం, రాజోలు, రేపల్లె తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం 8,800 చేనేతమగ్గాలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. ఒకప్పుడు వీటి సంఖ్య 25 వేలకు పైగానే ఉండేవి. భారీగా చేనేత మగ్గాలు తగ్గిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు.
అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు : గతంలో నలుగురు సభ్యులున్న చేనేత కార్మికుని కుటుంబంలో నెలకు 20 వేలు సంపాదించేవారు. ఇప్పుడు ఆ మొత్తంలో సగం కూడా రావటం లేదు. దీంతో కార్మికులు కుటుంబ నిర్వహణకు అప్పులుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పూట గడిచేందుకు అనేక మంది కార్మికులు మగ్గాలను వదిలి ఇతర పనులకు వెళ్తున్నారు. కొందరు కులవృత్తులను వీడలేక అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో చేనేతలను ఆదుకుంటానని హామీ ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక అందర్లానే వారిని విస్మరించారు. నేతన్న నేస్తం కింద 24 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దాన్ని కూడా సొంత మగ్గం ఉన్నవారికే పరిమితం చేశారు పడుగులు చేసే కార్మికులు, చేనేత ఉపవృత్తులు చేసేవారికి అసలు ఎగ్గొట్టేశారు. గతంలో అమలు చేసిన పలు పథకాలను జగన్ ఏలుబడిలో అటకెక్కించారని కార్మికులు వాపోతున్నారు.
'అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల దత్తత': నారా లోకేశ్