Telangana Samagra Kutumba Survey : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఎన్యూమరేటర్లు విధి నిర్వహణలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఎదురవుతున్నాయి. కొంతమంది ఇంటికి వెళితే ఇంటి యజమానులు దుర్భాషలాడటం, మీకెందుకు మా ఇంటి వివరాలు చెప్పాలంటూ, కుక్కలను వదులుతున్నారని మహిళా ఎన్యూమరేటర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
బంజారాహిల్స్ ప్రాంతంలో బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయునులు శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి వెళ్లారు. స్థానిక గతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినులుగా విధులు నిర్వహిస్తున్న అపురూప, రమ్మశ్రీ సర్వే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా బంజారాహిల్స్‌లోని అరోరా కాలనీలో ఓ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అక్కడ నివసించే ఓ మహిళ తమతో దురుసుగా ప్రవర్తించారని, అలాగే దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే గురువారం కూడా ఇలాంటి అనుభూతే సర్వే చేస్తున్నప్పుడు ఎదురైందని వారిరువురు వాపోయారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీ ప్రాంతంలో కొన్ని నివాసాల వద్దకు వెళితే యజమానులు తమపై పెంపుడు కుక్కలను ఉసిగొల్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు నివాసాల్లో యజమానులు తలుపులు తీయడం లేదని చెప్పారు. తమ వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలంటూ తిరిగి ఎదురు ప్రశ్నలు వేసి నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అరోరా కాలనీ ఘటనపై తమ ఉన్నతాధికారి జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారని ఉపాధ్యాయులు తెలిపారు.
ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే : శుక్రవారం వరకు ఇంటి యజమాని పేరు, ఇంటికి నంబరు వేసి సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, ఇవాళ్టి నుంచి సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించారు. ఈ సర్వేలో 75 రకాల ప్రశ్నలతో రెండు సెక్షన్స్‌లో కుటుంబ వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ప్రజలు తమ వద్ద ఆధార్, రేషన్‌కార్డు ఉంటే క్షణాల్లోనే కుటుంబ సర్వే పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఎవరికి ఎలాంటి పత్రాల కాపీలు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. మీకు ఇష్టమైతేనే వివరాలు చెప్పాలని తేల్చి చెప్పారు. ఎవరు ఎక్కడి నుంచైనా కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని వివరించారు.
నేటి నుంచి కుటుంబ వ్యక్తిగత వివరాల సర్వే - ఇల్లొదిలి దూర ప్రాంతాల్లో ఉండేవారు ఇలా చేస్తే సరిపోతుంది
సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆ పత్రాలు అడిగితే ఇచ్చేస్తున్నారా? - అయ్యో.. అలా ఇవ్వకూడదండి