High Prices for Tickets in Private Travels : పండగ వస్తే దూరం ప్రాంతాల్లో ఉండేవాళ్లు ఇంటికి వెళ్లడానికి నానా అవస్థలు పడతారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్దాం అనుకుంటే ఫుల్ రష్, సీటు దొరుకుతుందో లేదో అనే సందేహం. పోనీ ప్రైవేటు ట్రావెల్స్‌లో అయినా పోదాం అనుకుంటే.. అసలు ఆ ఛార్జులు ఉంటాయా! అన్నట్లు ఛార్జుల ధరలు చెబుతారు. వారు చెప్పే ధరలు వింటే విమానం టికెట్ కూడా ఇంత ఖరీదు చేయదు కదా అన్నట్లు ఉంటుంది. కొందరు తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రైవేటు ట్రావెల్స్ పైనే ఆధారపడతారు. ఎందుకంటే అవి చాలా వేగంగా వెళతాయి. కానీ వారు చెప్పే ఛార్జీలు చూస్తే మాత్రం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే!
తాజాగా కడపకు చెందిన వ్యక్తి దసరా పండగకు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజే పని నిమిత్తం హైదరాబాద్‌కు రావాలనుకున్నాడు. ఆర్టీసీ బస్సుల్లో చూస్తే ఫుల్ రష్. దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌కు సంబంధించిన చార్టును ఆన్లైన్లో చూశాడు. అందులో ఒక్కో టికెట్ రూ.5 వేలు ఉండటం చూసి అవాక్కు అయ్యాడు. సాధారణ సమయాల్లో అయితే కడప నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ.1000లోపే ఉంటుంది. అదీ కూడా పండగ వేళల్లో అయితే అది కాస్త రూ.2000 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.5 వేలు చేశారంటే ప్రైవేటు దోపిడీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యథేచ్ఛగా ప్రైవేటు ట్రావెల్స్ పండగ దోపిడీ : ప్రయాణికుల నుంచి బహిరంగంగానే దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. అత్యవసరమున్న వారు తప్పని పరిస్థితుల్లో 5 వేల రూపాయలు పెట్టి వెళ్తున్నారు. దసరా పండగ రద్దీ మంగళవారం కూడా కొనసాగనుంది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి అధిక ఛార్జీలు వసూలు చేసే వారిపై చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దసరా పండగ రద్దీ నేడు కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ విచ్చలవిడిగా రెచ్చిపోయే అవకాశం ఉంది. కడప నుంచి హైదరాబాద్‌కు మరీ ఇంత రేటా అంటూ సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండ్ అవుతుంది.
పండుగ ప్రయాణం వామ్మో మరీ ఇంత ఖరీదా? - రద్దీని 'క్యాష్' చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్