President visit Kanha Shanthi Vanam : భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావనలు పెరిగితేనే, బేధభావాలు లేకుండా కలిసి మెలిసి ఉంటూ వసుదైక కుటుంబంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President murmu) తెలిపారు. ఇవాళ రాష్ట్రపతి, కన్హా శాంతి వనంలో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరయ్యారు. రాష్ట్రపతికి హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ గైడ్ దాజీ ఘనస్వాగతం పలికారు. కన్హా శాంతి వనం ప్రాంగణంలో రాష్ట్రపతి మొక్క నాటారు.
World Spiritual Mahotsav 2024 : వివేకానందుడు బోధనలు సహా సర్వమతాలకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను రాష్ట్రపతి తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా తరలి వచ్చిన ప్రఖ్యాత గురువులు, స్వామీలతో గ్రూపు ఫోటో దిగారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘవాల్ ఘనంగా సన్మానించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వమతాల గురువులు, స్వామీలు తరలివచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా విభిన్న మతాలు, సంప్రదాయాలు అనుసరించే గురువులు, స్వామీలంతా ఒకే వేదికపైకి రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మంచి ఆధ్మాత్మిక విలువలతో పాటు ధ్యానం, యోగాపై శ్రీరామచంద్ర మిషన్(Sri Ramachandra Mission), హార్ట్‌ఫుల్‌నెస్ ట్రస్ట్ సంస్థలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుండటం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2023లో శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్‌కు పద్మభూషణ్ పురస్కారం అందజేసి గౌరవించిందని గుర్తు చేశారు.
భారతీయ ఆధునిక సమాజంలో ధ్యానం, యోగ సాధన అనేది జీవనంపై అత్యంత ప్రభావం చూపుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళం అనేది ఒక ఆరంభం మాత్రమేనని, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా హిందూ, ముస్లిం, జైనిజం, బుద్ధిజం, క్రైస్తవం, పార్శీ ఇతర అన్ని మతాల్లో సామరస్యం నెలకొల్పేందుకు కొన్ని ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
హృదయం, భావోద్వేగాలు అర్ధం చేసుకోవడానికి మరోమెట్టులా ఆయా కార్యక్రమాలు నిర్వహించి సత్ససంబంధాలు మరింత పటిష్ఠం చేస్తామని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేశారు. 1893లో పాశ్చాత్య దేశాల్లోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానంద, షికాగో వర్సిటీలో జరిగిన ప్రపంచ మత జాతరలో హిందూ, ఆధ్యాత్మిక బోధనల విశిష్టతలు గొప్పగా యావత్ ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు రంజనా చోప్రా, హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ - దాజీ, వేదగురువు త్రిదండి చినజియర్‌స్వామి, నమ్రముని మహరాజ్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
"భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావనలు పెరిగితేనే, బేధభావాలు లేకుండా కలిసి మెలిసి ఉంటూ వసుదైక కుటుంబంగా మారుతుంది. విశ్వశాంతి, మానవ కళ్యాణం కోసం సాగుతున్న ప్రపంచ ఆధ్మాత్మిక సమ్మేళనం అద్భుతం". - ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
జమిలి ఎన్నికలపై నివేదిక- రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్ కమిటీ
'చరిత్రలో ఎప్పటికీ గుర్తుగా అయోధ్య రామమందిరం- ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిది!'