President of India Tweet on Telangana Formation Day : తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయినందున దేశంలో ప్రముఖ వ్యక్తులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర చరిత్ర గురించి పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖలు శుభాకాంక్షలను చెప్పారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. 'రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పౌరులందరికీ ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ సుసంపన్నమైన వారసత్వం, మిశ్రమ సంస్కృతి, ఔత్సాహిక ప్రజలు కలిగి ఉంది. ఇది దేశంలోని ముఖ్యమైన టెక్నాలజీ హబ్‌గా అవతరించింది. తెలంగాణ ప్రజలు నిరంతరం అభివృద్ధి చెందాలని దీంతో పాటు దేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను ప్రార్థిస్తున్నానని' పోస్ట్ చేశారు.
PM Modi Wishes to Telangana People : ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో 'తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామని' ట్వీట్ చేశారు.
Venkaaiah naidu Tweet on TG Formation Day : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహోజ్వల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామా తెలంగాణ అని కీర్తించారు.
భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్‌లాగా విలసిల్లే హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌబ్రాతృత్వానికి గొప్ప ప్రతీకని అన్నారు. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బీజేపీ నాయకులు జేపీ నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమ ఎక్స్ ఖాతాలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ చరిత్రను ప్రశంసించారు.