No Screens for Pushpa 2 in Prasads Multiplex : చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, హైదరాబాద్ నగరవాసులకు ఎంతో ఇష్టమైన సినిమా థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందుంటుంది. ఇందులో ప్రతి మూవీని చూసేందుకు, సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా హీరో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో విడుదలైన పుష్ప ది రూల్‌ను ఇందులో చూడాలని ఎదురుచూస్తున్న సినీప్రియులకు చివరికి నిరాశే ఎదురైంది. ఈ సినిమాను తాము ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
We deeply regret this inconvenience and sincerely thank you for your understanding and continued support.#Pushpa2TheRule #PrasadMultiplex pic.twitter.com/vaUHN2rpFg
— Prasads Multiplex (@PrasadsCinemas) December 5, 2024
సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా సుమారు రెండు దశాబ్దాల నుంచి తాము వర్క్ చేస్తున్నామని ఎక్స్ వేదికగా ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ తెలిపింది. దురదృష్టవశాత్తూ, కొన్ని అనివార్య కారణాలతో ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో హీరో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2ను ప్రదర్శించలేకపోతున్నామని వెల్లడించింది. సినీ ప్రేమికులకు అసౌకర్యం కల్పించినందుకు తాము ఎంతో చింతిస్తున్నామని పేర్కొంది. తమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని పేర్కొంది. కాగా పుష్ప 2 సినిమాను ప్రదర్శించకపోవడం వెనక ఉన్న కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్ వేదికగా ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.
ఆర్థిక విషయాల్లో బేధాభిప్రాయాలు : మరోవైపు ఐమ్యాక్స్ పక్కనే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు జరుగుతుండటం, పోలీసు బందోబస్తు ఉండటం ఒక కారణమని తెలుస్తుండగా పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఆర్థిక విషయాల్లో బేధాభిప్రాయాలే కారణమని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రసాద్ ఐమ్యాక్స్ చరిత్రలో కరోనా కాలం మినహాయించి ఒక అగ్ర హీరో సినిమా ప్రదర్శనలు లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. పెద్ద సినిమాల విడుదల వల్ల రోజుకు 36 ఆటలతో సందడిగా ఉండే ఐమ్యాక్స్ పరిసరాలు ప్రస్తుతం సందడి లేకపోవడం గమనార్హం.
పుష్ప 2 ప్రీమియర్ షో అపశ్రుతి : మరోవైపు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప2’ చిత్రం ప్రీమియర్ షో నేపథ్యంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన రేవతి(39) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్(9)కు పోలీసులు సీపీఆర్ చేయగా అనంతరం బేగంపేట్ కిమ్స్‌కు తరలించారు.