Phone Tapping Case Updates : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని(Phone Tapping Case) నిందితులు ప్రణీత్‌రావు, తిరుపతన్నలు తమ బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. ఇరువురు బెయిల్ పిటిషన్లను సెషన్స్ కోర్టులో దాఖలు చేసుకోవాలని నాంపల్లి కింది కోర్టు సూచించింది. ఈ కేసులో నలుగురి పోలీస్ అధికారులపై పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
70 ఐటీ యాక్ట్ కేసు నమోదు చేయడంతో బక్కోక్కరికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలని, నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లను నిందితులు ఉపసంహరించుకున్నారు. సెషన్స్ కోర్టులో మంగళవారం మళ్లీ ప్రణీత్‌రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Phone Tapping in Telangana : మరోవైపు ట్యాపింగ్ కేసులో కీలకమైన హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయడంతో, దర్యాప్తు అధికారులకు ఆధారాల సేకరణ మరింత జఠిలంగా మారింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేపట్టిన సమయంలో ఎస్ఐబీలో పనిచేసిన ఇన్స్‌పెక్టర్లు, ఎస్సైలు, ఇతర సిబ్బంది వాంగ్మూలాలను ఆధారాలుగా సేకరిస్తున్నారు.
అలాగే క్షేత్రస్థాయి ఆపరేషన్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలపై గట్టుమల్లు సహా ఇతర పోలీసుల వాంగ్మూలాలనే బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే అంశంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు 35 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుల (Task Force Radhakishan Rao) ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఈ వాంగ్మూలాల ద్వారా తేట తెల్లమైనట్లు తెలుస్తోంది. వీటినే సాక్ష్యాధారాలుగా న్యాయమూర్తి ముందు పెట్టనున్నట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ ఓఎస్టీగా రాధాకిషన్‌రావులు ఆడిందే ఆటగా సాగినట్లు అధికారులు గుర్తించారు. అక్రమమని తెలిసినా రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ యథేచ్ఛగా సాగిపోయిందని, ఆ ఇద్దరూ బాస్‌లు కావడంతో వారి ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది తూచా తప్పకుండా పాటించక తప్పలేదని వారి వాంగ్మూలాలను బట్టి తెలుస్తోంది.