Prajavedika Program at TDP Central Office in Mangalagiri: తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సిద్ధవటం యానాదయ్య, దేవాలయాల జేఏసీ నాయకులమని చెప్పుకుని కొంతమంది ఒక్కొక్కరి నుంచి రూ.1 లక్ష వసూలు చేశారని కోనసీమ జిల్లా అప్పనపల్లి దేవాలయంలో పని చేస్తున్న నాయీబ్రాహ్మణులు టీడీపీ నేతలకు పిర్యాదు చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రూ. 10 కోట్ల వరకు దండుకున్నారని ఆరోపించారు. వారిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన బాధితులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 'ప్రజావేదిక'లో (Public Grievances at TDP Office) ఫిర్యాదు చేశారు.
అక్రమ కేసులతో వేధింపులు : ఈ ప్రజావేదికలో బాధితుల నుంచి పార్టీ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, సీడాప్ ఛైర్మన్ దీపక్‌రెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ తమ భూమిని ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సుధాకర్ అనే బాధితుడు వాపోయారు. తమ పొలంలోకి వెళ్లనీయకుండా సీఐ చిన్న గొల్ల కోటయ్య, కానిస్టేబుల్ మునేంద్రలు అడ్డుకుంటున్నారని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కలకు చెందిన వడ్డె హరికృష్ణ ఫిర్యాదు చేశారు.
ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తామని హామీ : తమకు వారసత్వంగా వచ్చిన భూమిని 15 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన కటక బీబీ వాపోయారు. తమ ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించడానికి రూ.1.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవాడకు చెందిన కొల్లా అప్పల సీతారామయ్య ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న నేతలు ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి బాధితుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారికి జైలుశిక్ష తప్పదు : మంత్రి మనోహర్