Prajavani Programme Started After Parliament Election Code : ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ ఆదివాసి మహిళా రైతు కలెక్టర్ కాళ్లపై పడి రోదించడం అందరిని కలిచివేసింది. బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన మహిళా రైతు గేడం ఆమోలిక తన భర్త రవీందర్ రెండు నెలల కిందట మరణించినా రైతు బీమా రాలేదని ఒక్కసారిగా కలెక్టర్ రాజర్షి షా కాళ్ల మీద పడి రోదించింది. స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న వ్యవసాయ అధికారి పుల్లయ్యను పిలిచి వివరాలు ఆరా తీశారు. రైతు చనిపోయిన సమయంలో బీమా ప్రీమియం గడువు ముగిసిందని, ఏమీ చేయలేమని పేర్కొన్నారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు మహిళలు తమకు కరెంటు బిల్లులు వస్తున్నాయని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వాటిని త్వరలో పరిష్కరిస్తామని అధికారి తెలిపారు.
"మాకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఒక్కొక్కరికి 1400, 3వేలు ఇలా వస్తుంది. కూలీ చేసుకుని బతికేటోళ్లం మాకు ఇంత కరెంటు బిల్లులు వస్తే ఎలా. తిని బతకాల లేకు కరెంటు బిల్లులు కట్టాలా మాకు అర్థం కావడం లేదు. అయినా కరెంటు బిల్లులు రావని చెప్పి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వడం లేదు. ఇస్తే అందరికి కరెంటు బిల్లులు ఇవ్వాలి లేదా ఎవ్వరికి కరెంటు బిల్లులు ఇవ్వకూడదు.బస్సు ఫ్రీగా పెట్టారు అది అవసరం లేదు కరెెంటు బిల్లులు ఇవ్వకండి." - మహిళలు
రెండున్నర నెలల తర్వాత మళ్లీ ప్రజావాణి - ఖాళీగా దర్శనమిచ్చిన అర్జీదారుల క్యూలైన్లు
ఉద్యోగం ఇప్పిస్తానని విలేఖరి మోసం : కరీంనగర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుదారులు పోటెత్తారు. కేశవపట్నం మండలం తాడికలకు చెందిన ఓ పత్రికా విలేఖరి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగిని నమ్మించి రూ.3 లక్షలు టోకరా వేసింది. మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న నిరుద్యోగిని వారం రోజుల క్రితం కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వారు స్పందించకపోవడంతో ప్రజావాణి కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేసింది.
"2016 నుంచి పింఛన్లు ఏ వికలాంగుడికి ఇవ్వడం లేదు. మాకు ఎలాంటి ఇళ్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఇదే ప్రజావాణిలో చాలా ఫిర్యాదు చేశాం కానీ ఎలాంటి ఫలితం లేదు. కిందటి నెలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాకు 2వ తేదీనా పింఛన్లు వేశారు. ఈనెల మొదలై ఇన్ని రోజులు గడిచినా పింఛన్ ఇంకా రాలేదు." - శంకర్, వికలాంగుడు
నేరుగా వచ్చి అర్జీలు ఇవ్వండి : మెదక్లో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించిన ఆయన ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించుకోవాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు.
'కోడ్ ముగిసింది - ఇకపై ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం'
ప్రజావాణికి ప్రజల విశేష స్పందన - సమస్యలు పరిష్కరించాలంటూ విన్నపాలు