Praja Palana Vijayotsavalu 2024 : కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐమాక్స్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసినటువంటి సంగీత కార్యక్రమం సంగీత అభిమానుల కేరింతల మధ్య జరిగింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
విజయోత్సవ సంబరాల వేళ ఆదివారం సాయంత్రం విద్యుత్ కాంతులతో ట్యాంక్‌బండ్ ప్రాంతం నూతన శోభను సంతరించుకుంది. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఫ్యామిలీ మెంబర్లతో సహా చేరుకున్నారు. డా. బీఆర్. అంబేడ్కర్ సచివాలయంతో సహా ఎన్టీఆర్‌గార్డెన్, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్ద మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ఆయా వేదికలపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.