- గురువంటే జ్ఞానాన్నివ్వడమే కాదు, విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవడం
- పాఠశాల విధులకు సమయానికి హాజరవడం కాదు, తన పరిధిని మించి బడి అభివృద్ధికి పాటుపడటం
- ఉద్యోగం అంటే ఓ బాధ్యతే కాదు. సమాజానికి, అభాగ్యులకు చేతనైన సాయం చేయడం
GOVT TEACHER PRABHU DAYAL STORY : పై ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్లే ఈ గురువుకు అప్లికేషన్‌తో నిమిత్తం లేకుండా రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. ఆయన పేరులోనే ‘దయ’ ఉండటం కాదు, చేసే ప్రతిపనిలో అదే గుణాన్ని చూపిస్తుంటారు. కొత్తగూడెం పట్టణం రామవరం గవర్నమెంట్ హెస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి (ఎంఈవో) డా.మారుముడి ప్రభుదయాళ్ ఇటీవల ప్రభుత్వం నుంచి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్‌గా అవార్డు స్వీకరించారు. ‘నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం.
దిల్లీ స్థాయిలో అవార్డు : ప్రభు దయాళ్ ఏపీపీఎస్సీ గ్రేడ్-2 క్యాడర్‌లో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించారు. తనకు తొలి పోస్టింగ్ 1993లో టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వచ్చింది. అక్కడ 2000 సంవత్సరం వరకు ఎంఈఓ, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్‌గా పలు హోదాల్లో పనిచేశారు. 2004-2011 వరకు భద్రాచలం ఐటీడీఏ బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్‌గా నిధులు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్‌సీటీఈ) నుంచి దిల్లీ స్థాయిలో అవార్డు తీసుకున్నారు.
2011-18 వరకు కొత్తగూడెం పట్టణం మేదరబస్తీ ఉన్నత పాఠశాలలో పనిచేశారు. ఏటా పలువురు విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలు పొందేలా తీర్చిదిద్దేందుకు విశేష కృషిచేశారు. అనంతరం ఖమ్మం జిల్లాలోని మధిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. అక్కడ 2018-2023 వరకు విధుల నిర్వర్తించి, గతేడాది తిరిగి కొత్తగూడెం రామవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టార్‌గా వచ్చారు. ఆ తర్వాత నోడల్ అధికారిగా పనిచేస్తూనే, తాజాగా ఎంఈఓ బాధ్యతలు చేపట్టారు.
విద్యార్థుల దత్తత : హాలిడేలతో నిమిత్తం లేకుండా ప్రభుదయాళ్ అందుబాటులో ఉంటారు. పనివేళలు లేని రోజుల్లోనూ పాఠశాలకు వెళ్లడం, గ్రౌండ్‌ను శుభ్రం చేయడం, చెట్లను నాటడం వంటి పనులు కొనసాగిస్తుంటారు. తాను పనిచేసే పాఠశాలలో విద్యార్థులను దత్తత తీసుకుంటారు. పిల్లలకు పాఠాలు నేర్పించడంతో పాటు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తే ఆయనే ప్రథమ చికిత్స అందిస్తారు. అవసరమయితే ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు.
ప్రస్తుతం ప్రభుదయాళ్ పనిచేస్తున్న బడిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు నీటితొట్లు ఏర్పాటు చేయించారు. వాటిని నిత్యం పిల్లలతో నింపిస్తూ జీవరాశులపై జాలి, దయ కనబరుస్తున్నారు. యాచకులు, అనాథలకు తనవంతు సాయం చేస్తుంటాడు పేద విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాడు. ఇటీవల రాష్ట్ర ఉపాధ్యాయ ప్రత్యేక అవార్డు స్వీకరణ సందర్భంగానూ, రాష్ట్ర వరద ముంపు బాధితులకు తనవంతుగా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించి పలువురి అభినందనలు అందుకున్నారు.
‘విద్యాలయాల్ని ఆలయంగా భావిస్తాను. రోజూ బడికి సమయానికే చేరుకోవడం, నా వంతుగా ఆ రోజు ఏం చేయాలో ఆలోచించి దాన్ని ఆచరణలో పెడతాను. నా సేవల్ని గుర్తించిన పలువురు ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలు, బహుకరించిన పతకాలు, అవార్డులు ఎంతో సంతృప్తిని ఇస్తాయి.’’ - ప్రభుదయాళ్, ప్రధానోపాధ్యాయుడు
మేడం సార్ మేడం అంతే - ఈ లెక్కల టీచర్ పాఠాలు చెప్పే లెక్కే వేరు - HAPPY TEACHERS DAY 2024