Power Projects in Partnership with APGENCO and NHPC : రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్‌కో, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు భాగస్వామ్య ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్‌హెచ్‌పీసీ వీసీ, ఎండీ రాజ్‌కుమార్ చౌదరీ, జెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పీఎస్పీలు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. ప్రాజెక్టుల ఏర్పాటు వ్యయాన్ని సమానంగా భరిస్తాయి. దీనిద్వారా మొత్తంగా లక్షా 106 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రతిపాదిత పీఎస్పీలను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా కొత్తగా 5 వేల 70 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.
APGENCO and NHPC in AP : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ, నిపుణులైన సిబ్బంది, నిర్మాణానికి అవసరమైన నిధులను ఒప్పందంలోని వాటా మేరకు ఏపీ జెన్‌కో సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పర్యావరణ, అటవీ శాఖల నుంచి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం, సాంకేతిక సిబ్బంది, తన వాటా కింద పెట్టుబడి మొత్తాన్ని ఎన్‌హెచ్‌పీసీ సమకూరుస్తుంది. పెట్టుబడి వ్యయం కింద అవసరమైన మొత్తాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి సమకూర్చేలా సంప్రదింపులు జరుపుతుంది. ప్రతి ఐదేళ్లకు రొటేషన్ విధానంలో ఛైర్మన్ లేదా ఎండీ నియామకం ఉంటుంది. జేవీ కంపెనీ మొదటి ఛైర్మన్‌గా ఏపీ జెన్‌కో వ్యవహరిస్తుంది. ఒక సంస్థ నుంచి చైర్మన్ ఉంటే మరో సంస్థ అధికారిని ఎండీ లేదా సీఎఫ్‌ఓగా జేవీ కంపెనీ నామినేట్ చేస్తుంది.
New Investments in AP in 2024 : ఒప్పందంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో భాగస్వామ్యం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వచ్చే అదనపు విద్యుత్‌తో గ్రిడ్ భద్రత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వేగంగా అనుమతులు వస్తాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందే అవకాశం ఉంటుంది. మొదటి దశలో యాగంటి, రాజుపాలెంలలో ప్రతిపాదించిన 1,800 మెగావాట్ల పీఎస్పీలు 7 వేల 735 కోట్లతో అభివృద్ధి చేస్తారు. 54 నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రతిపాదించారు.
రెండో దశలో 9 వేల 244 కోట్ల 43 లక్షల వ్యయంతో వైఎస్సార్ జిల్లాలో ముద్దనూరు, దీనేపల్లిల్లో 2వేల 70 మెగావాట్ల పీఎస్పీల నిర్మాణం జరుగుతుంది. 48 నెలల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదించారు. అన్నమయ్య జిల్లాలోని గడికోట పీఎస్పీని 7 వేల 291 కోట్ల 19 లక్షల వ్యయంతో 60 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. పీఎస్పీలకు సుమారు 11 వేల 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం సుమారు 50 వేల 395 ఎకరాల భూమి సేకరించాలని అధికారుల అంచనా వేస్తున్నారు.
జెన్‌కో, ఎన్‌హెచ్‌పీసీ ఏర్పాటు చేయనున్న 5 పీఎస్పీలకు 40 వేల 806 కోట్లు, పీఎస్పీలకు అవసరమైన సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 50 వేల 400 కోట్లు, భూముల లీజు కింద 8 వేల 900 కోట్లు మొత్తంగా లక్షా 106 కోట్లు పెట్టుబడులు వస్తాయి.