Postman Who Cheated The Customers : డబ్బును పొదుపు చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని కొంతమంది మహిళలను నమ్మించాడు ఓ పోస్ట్‌మ్యాన్. ఇది నమ్మిన మహిళలు కూలీ నాలీ చేసుకుని తాము సంపాదించిన డబ్బును అతడి వద్ద జమ చేశారు. వారి పేరు మీద పోస్టాఫీసులో అకౌంట్లు ఓపెన్ చేసినా డబ్బు జమచేయకుండా చేశానని నమ్మబలికి వారిని నట్టేట ముంచాడు.
చివరకు మూడు నెలల క్రితమే అతడు సస్పెండయ్యాడని తెలుసుకుని తమ డబ్బుల విషయమై పోస్టాఫీసులో విచారించిన మహిళలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విధంగా 45 మంది మహిళలు తమ వద్ద నుంచి సదరు పోస్ట్‌మ్యాన్ రూ.11.62 లక్షలు కాజేసినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా చిల్వకోడూరులో జరిగింది.
ఇదీ జరిగింది : బాధితుల సమాచారం ప్రకారం పోచయ్య అనే వ్యక్తి జగిత్యాల జిల్లా చిల్వకోడూరులో పోచయ్య గత 15 ఏళ్లుగా పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. విధులు నిర్వర్తించే క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకు పొదుపు గురించి అవగాహన కల్పిస్తూ డబ్బు పొదుపు ఆవశ్యకతను తెలియజెప్పేవాడు. సుకన్య సమృద్ది యోజన పథకం కింద సొమ్ము పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో మీ పిల్లలకు ఉపయోగపడుతుందని నమ్మబలకాడు. దీంతో రోజువారీ కూలీ చేసుకొనే వారు సైతం పోస్టాఫీసుల్లో తమ సొమ్ము జమ చేసుకొనేందుకు ఉత్సాహం కనబరిచారు.
పోస్టాఫీసుకు రావాల్సిన అవసరం లేదని తానే స్వయంగా వచ్చి సేకరిస్తానని బాధితులతో సదరు పోస్ట్‌మ్యాన్ చెప్పాడు. భవిష్యత్ అవసరాలకోసం పొదుపు చేస్తున్నాం కదా అనే ధీమాతో చిల్వకోడూరు, గోవిందుపల్లి, లక్ష్మిపూర్, భీంరాజ్ పల్లి తదితర గ్రామాలకు చెందిన వారు తమ పొదుపు చేయాలనుకుంటున్న సొమ్మును పోస్ట్‌మ్యాన్ వద్ద జమచేశారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులు పోస్ట్‌మ్యాన్‌ను మూడునెలల క్రితం సస్పెండ్ చేశారు.
డిపాజిటర్ల సొమ్ము రూ.20 లక్షలు నొక్కేసిన సబ్ పోస్ట్ మాస్టర్
తనను సస్పెండ్ చేసిన విషయం బయటకు తెలియనీయకుండా పోస్ట్‌మ్యాన్ జాగ్రత్తపడ్డారు. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఖాతాదారుల పాస్పుస్తకాలన్నింటినీ అధికారుల విచారణ పేరుతో వారి నుంచి సేకరించి తీసుకెళ్లాడు. పాస్‌పుస్తకాలు తీసుకెళ్లి మూడు నెలలు గడిచినా పోస్ట్‌మ్యాన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మ్యాన్‌పై అనుమానం వచ్చి తపాలా కార్యాలయంలో విచారించిన ఖాతాదారులు తాము మోసపోయామని తెలుసుకున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 45 మంది వద్ద 11లక్షల62వేల రూపాయలు కాజేసినట్లు తేలిందని గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు.
"పోచయ్య అనే పోస్టుమ్యాన్ వద్ద మేము ఫిక్సిడ్ డిపాజిట్ చేశాం. అయితే ఆయన ఇటీవల సస్పెండయ్యారని తెలిసి మేము పోస్ట్ఆఫీసుకు వెళ్లి విచారించాం. మాకు అసలు పోస్టాఫీసు అకౌంటే లేదని తపాలా సిబ్బంది తెలిపారు. మా పిల్లల భవిష్యత్‌కోసం ఉపయోగపడుతుందని చెప్పి పోస్ట్‌మెన్ వద్ద జమచేసుకుంటే పోస్ట్‌మెన్ పోచయ్య వాటిని పోస్టాఫీసు ఖాతాలో జమచేయకుండా మమ్మల్ని మోసం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టి మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను"- బాధితులు
పోస్టాఫీస్‌లో నగదు మాయమై నెల కావొస్తోంది - అయినా దర్యాప్తు దశలోనే అధికారులు
నాగార్జునసాగర్ పోస్ట్ ఆఫీస్‌లో పోయింది రూ.20 లక్షలు కాదు 40 లక్షలకు పైనే