Posters Against Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వెంటనే రాజీనామా చేయాలంటూ బేగంపేట, రూసూల్ పుర బస్టాప్, ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్లలో పోస్టర్లు వెలిసిన ఘటన కలకలం రేపింది. మైనంపల్లి అభిమానుల పేరుతో బస్టాప్‌ల వద్ద పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీని చేసి మాట నిలబెట్టుకున్నందని, దమ్ముంటే హరీశ్ రావు తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని సవాల్ చేస్తూ పోస్టర్లలో రాశారు.
కాగా పోస్టర్లు వెలిసిన కాసేపటికే మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని గతంలో హరీశ్ రావు ప్రకటించిన విషయం విధితమే. వీటిని ఎవరు ఏర్పాటు చేశారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
వైరా సభలో హరీశ్‌రావుపై సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో : ఆగస్టు 15న రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ' రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ఖమ్మం గడ్డ నుంచి మాటిచ్చాను. ఎంత మంది అడ్డుపడినా రైతు రుణమాఫీని చేసి చూపించాం. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. రుణమాఫీ పూర్తైనందున హరీశ్ తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి, తెలంగాణ ప్రజలను క్షమాపణ చెప్పాలి. మాట తప్పని పార్టీ రుణమాఫీ చేసిందని క్షమాపణ చెప్పాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు హరీశ్ చెప్పాలి' అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని చేసిన సందర్భంగా హరీశ్ రావు రాజీనామా చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు. తాజాగా హరీశ్ రావుకు వ్యతిరేకంగా పోస్టర్ల వ్యవహారంతో రాజకీయవాతావరణం వేడెక్కింది.