Lok Sabha Elections 2024 : రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు ఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం కాస్త మందకొడిగా పొలింగ్ కొనసాగగా ఆ తర్వాత కాస్త పుంజుకుంది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొలువాయిలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. గ్రామంలో వందశాతం ఓటు వేసి అక్కడి ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
గ్రామంలో 110 ఓట్లు ఉండగా ఎవరూ పనులకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండి, తమహక్కు వినియోగించుకున్నారు. 100 శాతం పొలింగ్ నమోదుపై జగిత్యాల కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా, చిన్న కొలువాయి ఓటర్లను అభినందించారు. తొలిసారి ఓటువేసేందుకు వచ్చిన యువ ఓటర్లకు ఎన్నికల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ మడల్ పోలింగ్ కేంద్రంలో స్వీప్ కమిటి ఆధ్వర్యంలో తొలిసారి ఓటు వేసేందుకు వచ్చిన యువతకు పుష్పగుచ్చాలందించి డప్పులతో స్వాగతం పలికారు.
మహబూబ్‌గర్ జిల్లా జడ్చర్లలో పోలింగ్ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. పూలతోరణాలు, బెలూన్లను కట్టి అలంకరించారు. ఆదర్శపొలింగ్ కేంద్రంకావడంతో, సరికొత్తగా తీర్చిదిద్దినట్లు అధికారులు వివరించారు. నల్గొండలో పర్యావరణహితంగా కొబ్బరి, అరటి ఆకులు, చిలుకలు, మామిడి తోరణాలతో పర్యావరణ హితంగా పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా, మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగింది.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా, వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది స్వతంత్రులు. అధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 45 మంది పోటీలో ఉండగా, తక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలోనిలిచారు. పోలింగ్ ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా అధికారులు సరిచేశారు. అనంతరం ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.
కొమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో ఈసారి అదనంగా 453 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అతికొద్ది మంది ఓటర్లు ఉన్నా, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష5 వేల 19 ఈవీఎం యూనిట్లను ఎన్నికల సంఘం వినియోగించింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 21 వేల 690 మంది ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర యూనిఫాం సిబ్బంది, సుమారు 65వేల మందితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20 వేలమందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. కేంద్రం నుంచి వచ్చిన 165 కంపెనీల సాయుధ బలగాలని మోహరించారు.
చింతమడకలో కేసీఆర్ - నందినగర్‌లో కేటీఆర్ ఓటు - తొలిసారి ఓటేసిన హిమాన్షు - kcr family casted vote