Buying Postal Ballot Votes : ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఒప్పంద ఉద్యోగులు ఓటుకు పోటెత్తుతున్నారు. పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు గంటల తరబడి ఎండల్లో నిరీక్షిస్తున్నారు. ఓటుకు 5వేలు ఇస్తామని బేరాలాడుతున్న పార్టీ నేతలకు ‘మీ సేవలు చాలు చిత్తగించండి’ అని ముఖం మీదే తేల్చేస్తున్నారు. కొన్నిచోట్ల తరిమినంత పనిచేస్తున్నారు. తమ మద్దతు ఏకపక్షమే, ఓటు ఎవరికనేది అంతా ఊహించిందేనని బాహాటంగానే చెబుతున్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉద్యోగవర్గాలు పోస్టల్ బ్యాలట్‌కు దరఖాస్తు చేసి, వినియోగించుకోవడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో మార్పు మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల30 వేల మంది పోస్టల్ బ్యాలట్లకు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారానికి వారిలో 3లక్షల 30 వేల మంది ఓట్లు వేయగా, అందులో 2లక్షల76వేల మంది పైగా ఉద్యోగులే. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ వినియోగించుకున్నవారు 2లక్షల38 వేల మందే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్లంటేనే ఓ పార్టీ ఉలిక్కిపడుతోంది. ఇన్నాళ్లూ వేధించి వెంటాడి ఇప్పుడు ఓట్లడిగితే తిరగబడతారనే భయం వారిని వెంటాడుతోంది. అయినా ఎంతోకొంత ప్రయత్నం చేయాలని నాలుగైదు రోజులుగా బేరసారాలు ప్రారంభించింది. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు 3వేల చొప్పున నిర్ణయించింది. మరోచోట 5వేలైనా ఇచ్చేందుకు సిద్ధమని ప్రలోభాలకు తెరతీసింది. యూపీఐ విధానంలో నగదు బదిలీకి సిద్ధమైంది. కవర్లలో పెట్టి నగదు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తున్న తరుణంలో ఈ ఓట్లతో అయినా కొంతమేర లాభపడాలనేది ఆలోచన చేస్తోంది.
పోస్టల్ ఓట్లలో మెజారిటీ సాధించాలని ఆశిస్తున్న ఆ పార్టీ ఎంత బతిమాలుతున్నా వారిని దగ్గరకు రానీయడం లేదు. పోస్టల్ బ్యాలట్ ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నవారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఛీ కొడుతున్న ఘటనలు కూడా ప్రకాశం జిల్లాలో వెలుగుచూశాయి. ఒక ఉద్యోగి అయితే ఏకంగా ప్రత్యర్థి పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల ఖర్చులకు ఉంచాలని కొంత మొత్తం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మరికొన్నిచోట్ల ఎన్నికల సంఘానికి ఉద్యోగులే ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులపై ప్రకాశం జిల్లాలో ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘమే పేర్కొంది.
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండుటెండల్లోనూ ఉత్సాహం కనబరుస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు అటూ ఇటూ తిప్పుతున్నా ఓపిగ్గా వెళ్తున్నారు. ఫాం2 దరఖాస్తు సమర్పించినా వారి పేర్లు ఓటరు జాబితాల్లో ఉండటం లేదు. మరోసారి రావాలని సూచిస్తున్నారు. అయినా ఒకటికి రెండుసార్లు తిరిగి మరీ తమ ఓటుపై ఆరాతీసి, ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.