Political nominations across Rayalaseema: రాయలసీమలోనూ అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేశారు. కార్యకర్తలు, అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి, నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం జగన్ తరఫున వైఎస్ మనోహర్‌రెడ్డి పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు.
పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి గా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలైంది. జగన్ తరఫున పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ఈ నెల 25న సీఎం జగన్ రెండోసారి నామినేషన్ వేస్తారని, మనోహర్‌రెడ్డి తెలిపారు. మైదుకూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్ వేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆర్వో కార్యాలయానికి వచ్చి, ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేశారు.
కర్నూలు పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు , కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి, నామినేషన్ వేశారు. ఇప్పటికే ఆయన ఈ నెల 19న ఒక సెట్ నామినేషన్ వేశారు. నంద్యాల జిల్లా డోన్‌లో మంత్రి బుగ్గన, పాణ్యంలో కాటసాని వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
తిరుపతి లోక్‌సభ కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ నామినేషన్ వేశారు. బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. గుంతకల్లు కూటమి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం నామినేషన్ దాఖలు చేశారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి, ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి చేరుకుని పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు.
నెల్లూరు లోక్‌సభ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి, ఇతర తెలుగుదేశం నేతలతో కలిసి, పత్రాలు సమర్పించారు. నెల్లూరు అర్బన్ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నామినేషన్ వేశారు. కార్యకర్తలతో కలిసి, భారీ ర్యాలీగా వచ్చి పత్రాలు సమర్పించారు.
ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి కూటమి అభ్యర్థిగా కాకర్ల సురేష్, సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా మంత్రి కాకాణి, నెల్లూరు లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా కొప్పాల రఘు నామినేషన్ వేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కూటమి అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి. నామినేషన్ వేశారు వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్లు సమర్పించారు.