Police Tips For Identify Cyber Frauds : సైబర్ నేరస్థులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త ఎత్తులు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు సైబర్ నేరాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మోసగాళ్లు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోకవైపు ప్రముఖ వ్యక్తుల సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు వసులు చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు.
కాకినాడ జిల్లా కరప ప్రాంతానికి చెందిన రాజకుమార్‌కు గత నెల 19వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీపై మనీ లాండరింగ్ పేరుతో కేసు నమోదైందని, అలాగే మీ సిమ్ నంబరుతో చట్టవిరుద్ధమైన వ్యవహారాలు జరిగాయని అతన్ని బెదిరించాడు. తరువాత ఇంకో వ్యక్తి పోలీసు దుస్తులతో వీడియోకాల్ చేసి కోర్టు ఖర్చులకు రూ.25 వేలు పంపాలని డిమాండ్ చేశాడు. అతను భయపడి అడిగిన నగదు చెల్లిస్తే మరో రూ.25 వేలు పంపమని ఆదేశించాడు. దీంతో తన వద్ద డబ్బు లేదని, పోలీసులను కలుస్తానని చెప్పడంతో అవతల వ్యక్తి వెంటనే కాల్ కట్‌చేశాడు.
రోజుకో ముసుగులో సైబర్ వల - లింక్స్‌పై క్లిక్ చేశారో అంతే ! - APK File Phone Hacking Cyber Fraud
కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన వ్యక్తికి వాట్సప్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో కాల్ చేసి సీబీఐ అధికారినని ఓ కేసులో పక్క రాష్ట్రంలో ఉన్న మీ కుమార్తెను అరెస్టు చేశామని బెదిరించాడు. తన కుమార్తె ఇంట్లోనే ఉండటంతో తనకు ఫోన్ చేసింది సైబర్ నేరగాడని గ్రహించి ఎదురుతిరగడంతో అవతల వ్యక్తి కట్ చేశాడు. ఈ రెండు ఉదంతాలతోపాటు ఇటీవల అల్లవరం మండలంలోనూ ఓ వ్యక్తికి వీడియోకాల్ చేసి బెదిరించింది పోలీసు దుస్తుల్లో ఉన్న ఒకే వ్యక్తి కావడం గమనార్హం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఓ చోట నిత్యం ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బాధితుల్లో కొందరు అప్రమత్తంగా వ్యవహరించి బయటపడుతుంటే మరికొందరు మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కస్టమ్స్, సీబీఐ, ఈడీ, నార్కోటిక్ వంటి పలు రకాల సంస్థల అధికారులమని చెప్పి కేసులు, డిజిటల్ అరెస్టులు, కోర్టు విచారణల పేరిట భయపెట్టి, బెదిరించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
డిజిటల్ మోసాల తీరిలా :
- కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటారు. మీ పేరుతో విదేశాలలో ఉన్న కుటుంబీకులు, బంధువులు నుంచి ఓ పార్సిల్ వచ్చిందని అందులో మాదకద్రవ్యాలు, ఆయుధాలు, నకిలీ పాస్‌పోర్టులు గుర్తించామంటారు. దానిపై ముంబయి, దిల్లీ క్రైం విభాగంలో కేసు నమోదైందని నకిలీ ఎఫ్‌ఐఆర్ చూపిస్తారు.
- మనీ లాండరింగ్, మీ బ్యాంకు ఖాతా నుంచి పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని, మీ ఫోన్ నంబరు అనేక మోసపూరిత ఖాతాలతో అనుసంధానమైందని చెబుతారు. దీనిపై ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ మీతో మాట్లాడతారంటారు.
- మీరు ఫోన్‌లో చూడకూడని కంటెంట్ చూస్తున్నారంటూ బెదిరించి సొమ్ములు దోచుకునేవారూ ఉన్నారు.
విచారణ పేరుతో వీడియో కాల్స్ :
సైబర్ నేరగాళ్లు తమను రకరకాల హోదాలతో పరిచయం చేసుకుంటారు. నమ్మకం కలిగేలా మాట్లాడతారు. పోలీసు దుస్తులు, ఆయా సంస్థల లోగోలు, నకిలీ పోలీసుస్టేషన్ల సెట్లలో కూర్చొని వీడియోకాల్స్ చేస్తారు. మాయమాటలతో మన వ్యక్తిగత వివరాలు సేకరించి భయపెడతారు. వీడియో కాల్ చేసి విచారణ పూర్తయ్యేవరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదంటారు. ఇప్పటికిప్పుడు తాము చెప్పినట్లు చేయకపోతే అరెస్టు తప్పదని, ఇంటి బయటే పోలీసు అధికారులు ఉన్నారని ఒత్తిడి తెస్తారు. కేసు నుంచి బయటపడాలంటే అపరాధ రుసుము, కోర్టు ఫీజులు చెల్లించాలని బెదిరిస్తారు.
పోలీసు అధికారుల సూచనలివీ :
- డిజిటల్ అరెస్టు అనేది మన చట్టాల్లో లేదు. అలా ఎవరైనా చెబుతుంటే అది పక్కా మోసపూరితం
- చట్టబద్ధమైన ఏజెన్సీలేవీ తక్షణం డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి చేయవనే విషయాన్ని తెలుసుకోవాలి.
- ఇలాంటి ఫోన్లు వస్తే ధైర్యంగా మాట్లాడాలి. మనం భయానికి లొంగామా వారి పని సులువవుతుంది. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దు. పదే పదే చేస్తుంటే ఆ నంబర్లను బ్లాక్ చేయాలి.
- ఫోన్ చేసి మిమ్మల్ని నమ్మించేందుకు మీ వ్యక్తిగత వివరాలు చాలానే చెబుతారు. వాటికి స్పందించవద్దు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలి. నగదు బదిలీ చేయొద్దు. వీలైతే వీడియో కాల్‌లో వ్యక్తిని స్క్రీన్‌షాట్ తీయండి, లేదా కాల్‌ను రికార్డు చేయండి. వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు చేసి ఫిర్యాదు చేయండి. లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు ఇవ్వచ్చు.
ఇవి మాత్రం చెప్పొద్దు :
- పిన్, ఓటీపీ అడిగితే చెప్పొద్దు/పంపొద్దు
- సామాజిక మాధ్యమాల్లో వచ్చే తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు.
- సైబర్ మోసగాళ్లు తరచూ ప్రజలకు, వినియోగదారులకు తప్పుడు కస్టమర్ కేర్ నంబర్లను ఇస్తారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఎల్లప్పుడూ సదరు బ్యాంకు, లేదా ప్రభుత్వ శాఖ, సంస్థలు, కంపెనీల అధికారిక, ఒరిజనల్ వెబ్‌సైట్లనే సంప్రదించాలి.
పెరుగుతున్న సైబర్ మోసాలు - మూడేళ్లలో రూ.940 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు - Cyber Frauds in AP