Police Solved Three Womens Murder Case in Kurnool: కర్నూలులోని నగరవనం వద్ద ఇటీవల కలకలం రేపిన ముగ్గురు మహిళల మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. కర్నూలులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ మహబూబ్ బాషా ఇద్దరు మహిళల మృతికి కారణమని నిర్ధారణ కావటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ నెల 19న కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో బయటపడిన ముగ్గురు మహిళల మృతదేహాల్లో ఇద్దరు మహిళల మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి వివరాలను వెల్లడించారు.
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జానకి, అరుణ అనే మహిళలిద్దరూ వేశ్య వృత్తిలో కొనసాగుతూ కర్నూలుకు వచ్చేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వారికి ఆటోడ్రైవర్ షేక్ మహబూబ్ బాషా పరిచమయ్యాడు. జానకితో మనస్పర్దలు ఏర్పడడంతో ఆటోడ్రైవర్ షేక్ మహబూబ్ బాషాను ఇతర వ్యక్తులతో కొట్టించింది. దీంతో పగ పెంచుకున్న బాషా ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూశాడు. ఈ నెల 19న అరుణ, జానకి ఆయన ఆటోలోనే నగర వనం వద్దకు దుస్తులు ఉతికేందుకు వచ్చారు.
దుస్తులు ఉతుకుతున్న జానకిని ఆటోడ్రైవర్ నీళ్లలోకి తోసి అతను అందులో పడి పోయాడు. అక్కడే ఉన్న అరుణ వారిని కాపాడే క్రమంలో ఆమె కూడా నీళ్లలో పడిపోయి మునిగిపోయింది. గట్టు దగ్గరగా ఉండటంతో ఆటోడ్రైవర్ బయటపడి వెళ్లిపోయాడు. మహిళలిద్దరూ నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయి మరుసటి రోజు శవాలై తేలారు. కేసు నమోదు చేసిన కర్నూలు తాలుకా అర్బన్ స్టేషన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. మరో మహిళ మృతదేహానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.
Womens Died in Nagaravanam Pond: కర్నూలు సమీపంలోని గార్గేయపురం గ్రామంలో ఉన్న నగరవనం చెరువులో గత ఆదివారం ముగ్గరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాల్ని స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. అయితే చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.