Police Solves Dundigal Woman Murder Case : ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తిని బెదిరించింది. తమ సంబంధం గురించి కుటుంబసభ్యలుకు చెప్పి పరువు తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో భయపడి ఆ వ్యక్తి ఆమెకు రెండు లక్షల రూపాయలు ఇచ్చినా మళ్లీ డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో ఆగ్రహంతో అతడు ఆ మహిళ గొంతు నులిమి హతమార్చాడు. గత సెప్టెంబరు 23న దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేటలో వంశీ రెసిడెన్సీలో నివాసముంటూ మిల్క్ పాయింట్ నిర్వహిస్తున్న శారద (50)అనే మహిళ గత రెండు నెలల క్రితం హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారని అని మృతురాలి కుమారుడు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక ఆధారంగా మృతురాలు బి.శారదను చంపిన నిందితుడు ఎ. ప్రవీణ్ కుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు ప్రవీణ్ కుమార్ అనే ప్రైవేట్ ఉద్యోగికి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మొబైల్ షాప్‌లో శారద (50)అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు తరచూ ఫోన్లో వాట్సప్ కాల్స్ మాట్లాడుకునేవారు.
రూ .2 లక్షలు ఇచ్చిన బ్లాక్‌మెయిలింగ్ : 2020లో శారద హైదరాబాద్‌కు మారారు. ఈ క్రమంలో గత సంవత్సరం నుంచి శారద డబ్బు కోసం ప్రవీణ్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. డబ్బు ఇవ్వకపోతే వారి సంబంధం గురించి కుటుంబసభ్యులకు చెప్పి, కేసు వేసి పరువు తీస్తానంటూ బెదిరించింది. భయపడిన ప్రవీణ్ ఆమెకు రూ. 2 లక్షలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ శారదకు ఫోన్ చేసి తన వీడియోలను తీసుకుంటానని, తనను కలవాలని కోరగా మల్లంపేటకు రమ్మని ఆమె చెప్పింది.
దీంతో ప్రవీణ్ సెప్టెంబర్ 23న తన స్వస్థలం ఉట్నూర్ నుంచి మల్లంపేటలోని శారద ఫ్లాట్‌కు వెళ్లాడు. శారద ఇంటికి వెళ్లిన ప్రవీణ్ తన వీడియోలను తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో డబ్బు ఇవ్వాలంటూ శారద డిమాండ్ చేయడంతో కోపంతో ప్రవీణ్ ఆమె గొంతును నులిమి చంపేశాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించిన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.