Police Search for Peddireddy Follower Madhavareddy : మదనపల్లె సబ్కలెక్టర్లో ఫైళ్ల దహనం కేసు చిక్కుముడి ఇంకా వీడలేదు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. దస్త్రాల దహనంపై పోలీసు, రెవెన్యూశాఖలు సమాంతరంగా విచారణ జరుపుతున్నాయి. కాలిపోయిన దస్త్రాలు రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు మదనపల్లెలోనే మకాం వేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
అన్ని కోణాల్లో శరవేగంగా దర్యాప్తు : మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో ముమ్మర దర్యాప్తు సాగుతోంది. రెవెన్యూ, పోలీసుశాఖలు ప్రత్యేక దృష్టిపెట్టి ఈ కేసు విచారణ సాగిస్తున్నాయి. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మాధవరెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా వంకమద్దెవారిపల్లెలోనూ వెతికారు. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట భూములు రిజిస్ట్రేషన్ జరగడంలో మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.
మాధవ్‌రెడ్డి దొరికితే కేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని భావిస్తున్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పని చేసిన ఆర్డీవో హరిప్రసాద్‌తోపాటు 37 మంది సిబ్బంది, పూర్వ ఆర్డీవో మురళిని విచారిస్తున్నారు. వారి కాల్‌డేటా ఆధారంగా ఎవరెవరికి ఫోన్ల్ చేశారో వివరాలు రాబడుతున్నారు. కొన్ని నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపించారు. ఈ ఘటనలో కుట్ర దారులు ఎవరో నిష్పక్షపాకతంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐ వల్లిబసును వీఆర్‌కు పంపగా కానిస్టేబుళ్లు హరిప్రసాద్, భాస్కర్‌ను సస్పెండ్ చేశారు.
2400 దస్త్రాలు కాలిపోయాయి : రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా స్వయంగా మదనపల్లెలో కాలిపోయిన సబ్‌కలెక్టర్ కార్యాలయం పరిశీలించారు. ఏయే దస్త్రాలు కాలిపోయాయో ఆరా తీస్తున్నారు. మొత్తం 2,400 దస్త్రాలు దహనమవ్వగా, మరో 700 పాక్షికంగా దహనమైనట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధారాల కోసం కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు సిసోదియా తెలిపారు.సచివాలయాలతోపాటు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లి ఆయన తనిఖీ చేశారు.
బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరణ : మూడేళ్లుగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన భూ ఆక్రమణలు, దందాలకు సంబంధించి ప్రజల నుంచి నేడు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ప్రజలు నిర్భయంగా వచ్చి ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు సూచించారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు వందల ఎకరాలు దోచుకున్నారని బాధితులు ఆరోపించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని అగ్నిమాపకశాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు ఏంటని విచారించారు. జులై 10 నుంచి సీసీ కెమెరాలు పని చేయకపోవడంపైనా అధికారులు ఆరా తీశారు.
"మాజీ మంత్రి, ఆయన అనుచరులు మదనపల్లె, పుంగనూరులో భూ దందాలు పూర్తిగా చేశారు. వేల ఎకరాలు సంపాదించుకున్నారు. పెద్దిరెడ్డి అనుచరుడైన మాధవరెడ్డి గుండాలను వెంట పెట్టుకొని చుట్టూ పక్కల ఉన్న రైతులు, వ్యాపారుల నుంచి అక్రమంగా భూమిని లాక్కొనున్నారు. ఈ విషయంపై ఎమ్మార్వోకు ఎన్ని సార్లు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు" -బాధితులు