Police Raids in Banjara Hills After Nine Pub : బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఆఫ్టర్ 9 పబ్‌పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్ కొనసాగుతోందని, అందుకే దాడులు చేసినట్లు తెలిపారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది యువతులను తీసుకువచ్చి, నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని చెప్పారు. గత నాలుగు రోజులుగా పబ్‌పై నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పబ్ యజమాని సతీశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మరోవైపు మొత్తం 32 మంది యువతులను, 131 మంది యువకులను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించేశారు. అదుపులోకి తీసుకున్న వారందరికీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపించారు. యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు పబ్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా విచారణ చేస్తున్నారు.
పబ్బుల్లోకి మైనర్లు.. నిబంధనలు పట్టించుకోని నిర్వాహకులు
Urvasi Bar And Restaurant License Cancelled by Excise Police : ఇటీవల సికింద్రాబాద్‌లోని ఊర్వశి బార్‌పై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బార్ నిర్వాహకులు, మేనేజర్లతో సహా మొత్తం 107 మందిని అరెస్టు చేశారు. వీరిలో 30 మంది యువతులు, కాగా మరో 60 మంది కస్టమర్లు, ఇంకో 17 మంది నిర్వాహకులున్నారు. కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు బేగంపేట పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్‌లో అశ్లీల కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను నిర్వహించడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు లేఖ రాశారు. దీంతో ఊర్వశి బార్‌ను మూసివేసి లైసెన్సును రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బార్స్, రెస్టారెెంట్లు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.