Police Problems in Andhra Pradesh : వారాంతపు సెలవులు లేక తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు.అయినా ఫలితం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అమితమైన ప్రేమను ఒలకబోశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వీక్లీ ఆఫ్లు ఇస్తానంటూ హామీ గుప్పించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత వీక్లీ ఆఫ్లు అమలు చేశారు. ఆరు నెలలు గడిచిందో లేదో వారాంతపు సెలవులకు మంగళం పాడేశారు. అదేమని అడిగితే సరిపడా సిబ్బంది లేరంటూ వంకపెట్టారు. జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నట్టేట ముంచారు. పోలీసు రిక్రూట్మెంట్ చేయకుండా వదిలేశారు. ఒక పక్క వందల సంఖ్యలో సిబ్బంది ఉద్యోగ విరమణ చేస్తుంటే దానికి తగ్గట్టుగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కించారు. ఉన్న అరకొర పోలీస్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.
విధి నిర్వహణలో భాగంగా ప్రతి పోలీసు గస్తీ తిరగాల్సిందే. వివిధ ప్రాంతాలకు వెళ్లాలి. దీని నిమిత్తం సిబ్బంది అందరికీ టీఏ ఇచ్చేవారు. ప్రతి నెలా రూ. 1,400లు చెల్లించేవారు. బందోబస్తుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళితే రోజుకు టీఏగా రూ.500ల నుంచి రూ.600ల వరకు ఇచ్చేవారు. గత ప్రభుత్వ హయాంలో ఆలస్యంగా ఇచ్చినా కనీసం మూడు, నాలుగు నెలలకు ఒకసారైనా సొమ్ము మొత్తం చెల్లించేవారు. ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు వస్తుండడంతో పోలీసులూ సంతోషించే వారు. వైఎస్సార్సీపీ పాలనలో టీఏ, డీఏలు ఇవ్వడం మానేశారు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉండడంతో సిబ్బంది తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కానీ గట్టిగా అడగలేని పరిస్థితి అంతర్గతంగా పోరాటం చేస్తేనే టీఏలు విడుదల చేసేవారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
పోలీస్ సిబ్బంది అంటే 24x7 డ్యూటీ చేయాల్సిందే. ఏడాది పొడవునా విధులు నిర్వహించాలి. నిరంతరం విధుల్లో ఉండడంతో వీరి కోసం ఏడాదికి ఒక నెల జీతం అదనంగా చెల్లించేవారు. దీన్ని విడతల వారీగా చెల్లించేవారు. ఇలా ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు సుమారు మూడు టర్మ్ల సరెండర్ లీవులు చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్కరికి వారి క్యాడర్ను బట్టి అంటే కానిస్టేబుల్ నుంచి సీపీ వరకు ఒక్కొక్కరికి రూ. లక్ష నుంచి రూ.4.5లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. దీనిపై యూనియన్ నాయకులు అడుగుతున్నా ప్రభుత్వం మీన మేషాలు లెక్కి స్తోందని పోలీసు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.