Telangana Rains 2024 : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పోలీసు యంత్రాంగం 16 గంటలకు పైగా నిరంతరం పనిచేసి రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించారు. రైల్వే అధికారులు ప్రయాణికులను వారి, వారి గమ్యస్థానాలకు రైళ్లను ఏర్పాటు చేశారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం రైల్వే ట్రాక్ కింద ఉన్న కంకర కొంత భాగం కొట్టుకపోవడంతో రైలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో స్థానిక పోలీసు సిబ్బంది సహాయం చేశారు.
పోలీసులు అప్రమత్తం : నాగర్ కర్నూలు జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పోలీసు సిబ్బంది కాపాడడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. జిల్లాల ఎస్పీలు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ జిల్లాలోని పాస్ర నుండి తాడ్వాయి మధ్య గల జలగలించ వాగు ఉదృతంగా ప్రవహించడంతో సిబ్బందిని నియమించారు. జోగులాంబ గద్వాల్ ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎర్రబెల్లి వాగును సందర్శించారు.
కోదాడ పట్టణంలో శ్రీరంగాపురం వద్ద వరదలో చిక్కుకున్న మూడు బస్సుల ప్రయాణికులను పోలీసులు కాపాడారు. చంద్రుగొండ మండలం సీతయ్య గూడెం వద్ద వెంగల్‌రావు ప్రాజెక్టు వరద ఉధృతిని , గోధుమ వాగు ఉధృతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. భద్రాద్రి కోతగూడెం జిల్లాలో, ఎస్పీ రోహిత్ రాజు, కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌తో కలిసి, మణుగూరు ప్రాంతంలో వరద పరిస్థితిని పరిశీలించారు.
మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఏడుపాయల వద్ద వరద ప్రాంతాలను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ద్విచక్ర వాహనంపై తిరిగి వరద ప్రాంతాల పరిస్థితులను తెలుసుకున్నారు. సిద్దిపేట కమిషనర్ అనురాధ మందపల్లి వాగును పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తదితరులు వరద ప్రాంతాన్ని సందర్శించారు.
భారీ వర్షాలకు రోడ్లపై పడి ఉన్న చెట్లను వాహనాలను స్థానిక పోలీసు సిబ్బంది తొలగించారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ డాక్టర్ జితేందర్ పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, అధికారులు, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వరద సహాయక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. మరో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.
జోరువానలకు ఉమ్మడి మెదక్, పాలమూరు జిల్లాలు అతలాకుతలం - నేడు రెడ్ అలర్ట్ జారీ - TELANGANA RAINS 2024