Police Safety Tips for Public From Thefts : దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే బీ కేర్‌ఫుల్. మీరలా వెళ్లి, ఇలా తిరిగి వచ్చేసరికి ఇళ్లు గుల్ల అయ్యే ప్రమాదముంది. ఎందుకంటే దసరా సెలవుల్లో తాళాలు వేసి ఉన్న నివాసాలే దొంగల టార్గెట్. రాత్రి సమయాల్లో ఎవరికి కనిపించకుండా దొంగలు వస్తారు, దోచుకుపోతారు అని అందరూ అనుకుంటారు. కానీ నగర ప్రాంతాల్లో పక్కింటి వారు ఉన్నారో లేరో అనే సంబంధం లేకుండా ఒకరికొకరు వ్యవహరిస్తుంటారు. దీంతో కాలనీల్లో దొంగలు యథేచ్ఛగా సంచరిస్తూ ఏ ఇంటికి తాళం ఉందో నిఘా వేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. సెలవుల్లో వారంరోజుల పాటు చాలా మంది సొంత ఊళ్లకు పయనమవటం, విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. ఇదే అదునుగా భావించి ఇతర సమయాలతో పోలిస్తే జిల్లాలో సెలవు రోజుల్లో దొంగతనాలు 30 శాతం అధికంగా నమోదవుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
అంతర్రాష్ట్ర దొంగలు, ఇతర జిల్లాలకు చెందిన చోరులు కూలీ పనులు, వివిధ వస్తువులు అమ్ముతూ జీవనం సాగించటానికి జిల్లాకు వచ్చి అనువైన ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా నగర శివారు ప్రాంతాలు, కాలనీల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉదయం సమయంలో రెక్కీ నిర్వహించి, రాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు.
పోలీసులు నిఘా పెంచాలి : మామూలు రోజులతో పోలిస్తే పండగ పూట పెట్రోలింగ్ పెంచాలి. ప్రత్యేక నేర బృందాలు పాత నేరస్థులను గుర్తించి, వారికి ముందస్తుగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. జైలు నుంచి విడుదలైన పాత నేరస్థుల కదలికలపై సైతం పటిష్ఠ నిఘా ఉంచాలి.
ఊరెళ్లేవారికి పోలీసు అధికారుల సూచనలు
- పండగపూట ఊరెళ్లాల్సి వస్తే విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి.
- కాలనీలో అనుమానాస్పదంగా, గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి, సమాచారం అందించాలి.
- ఊరికి వెళ్లే ముందు తమకు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
- ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్, సెంట్రల్ లాక్ సిస్టమ్ వంటి పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను అమర్చుకోవాలి.
- వెహికల్స్‌ను ఆరుబయట కాకుండా ఇంటి ఆవరణలో నిలపాలి.
- ఇంట్లో చీకటి ఉండకుండా లైట్స్‌ను ఆన్‌లో పెట్టి ఉంచాలి.
- అపార్ట్‌మెంట్‌ల వద్ద సాధ్యమైనంతవరకు నమ్మకమైన వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి.
- ఊరెళ్తున్న విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పంచుకోరాదు.
- కాలనీల్లో వాలంటరీ కమీటీలను ఏర్పాటు చేసుకోవాలి. పోలీసులకు అందుబాటులో ఉండాలి.
పక్కన చేరి, ఘరానా చోరీ - హైదరాబాద్‌లో దోపిడీ ముఠాల హల్చల్ - THEFT GANGS IN HYDERABAD