Police Involved in Civil Disputes in Prakasam District :
- టంగుటూరు మండలం జమ్ములపాలేనికి చెందిన ఒకరు విదేశాల్లో ఉంటున్నారు. తనకున్న భూములపై సమీప బంధువుకు జీపీఏ ఇచ్చారు. ఆ భూమిని తనదిగా చూపుతూ డెయిరీ యూనిట్ ఏర్పాటుకు ఓ మహిళ ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న జీపీఏ పొందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు స్టేషన్ చుట్టూ రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
- కొత్తపట్నం మండలానికి చెందిన ఓ మహిళ తన కుమారుడి వైద్యచికిత్స నిమిత్తం ఒంగోలులోని ఒక ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో ఆమె మెడలోని గొలుసు మాయమైంది. ఈ విషయాన్ని ఆ మహిళ తండ్రి పోలీసులకు తెలిపి కేసు నమోదు చేయాలని కోరారు. ఎక్కడెక్కడో పోగొట్టుకుంటే మేం కేసు నమోదు చేయాలా అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించారు.
- ఒంగోలులో ఇటీవల చోరీ చోటు చేసుకుంది. సుమారు 15 సవర్ల బంగారం అపహరణకు గురైంది. పోలీసులు నేరస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేకుల ఇంట్లో నివసించే మీకు ఇంత బంగారం ఎక్కడిదంటూ బాధితులను అవమానించేలా మాట్లాడారు.
- మద్యం తాగి వచ్చి ఓ వ్యక్తి తరచూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. సదరు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు పక్షాలను స్టేషన్‌కు పిలిపించారు. ఈ వ్యవహారంలో భర్త తరఫున దర్శి నియోజకవర్గంలోని ఓ ఎస్ఐ వకాల్తా పుచ్చుకున్నారు. చర్చించే క్రమంలో బాధిత మహిళ తండ్రిపై చేయి చేసుకున్నారు. సదరు మహిళను దుర్భాషలాడుతూ తోలు తీస్తానంటూ బెదిరించి పంపారు.
నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచిన బ్యాంకు మేనేజర్ - కోట్లలో స్వాహా
క్షేత్రస్థాయి పోలీసింగ్ గాడి తప్పుతోంది. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా పోలీసు బాస్ దూకుడుగా వ్యవహరిస్తూ అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కృషిచేస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం ఆయనకు మస్కా కొడుతూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదుదారులను బెంబేలెత్తిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారు. సరికదా తిరిగి వారి పైనే ఎదురుదాడికి దిగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల సిఫారసులు ఉంటేనే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా వ్యవహార తీరు మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠనే మసకబారుస్తోంది.
సివిల్ వివాదాల్లో వేధింపులు : కొందరు అధికారులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు. కొత్తపట్నం మండలంలోని ఒక హేచరీ వ్యవహారంలో పొన్నలూరు మండలానికి చెందిన పరుచూరి రాజశేఖర్ అనే వ్యక్తిని మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురిచేశారు. ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. వారం రోజులపాటు వైద్యశాలలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తుల ఫిర్యాదుతో క్యాటరింగ్ చేసుకునే యువకుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో భాగంగా ఓ ఎస్సై అతనిపై చేయి చేసుకోవడంతో మనస్తాపంతో సదరు వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
క్షేత్రస్థాయిపై దృష్టి సారిస్తేనే మేలు : ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దామోదర్ క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి పలు స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలిరోజులు కావడంతో స్టేషన్ల నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బందికి వసతుల కల్పన పైనే ఆయన సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ మేరకే సదరు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లాలో జిల్లాలో అసాంఘిక శక్తుల అణచివేతపై దృష్టిపెట్టారు. తానే స్వయంగా లాఠీ పట్టి పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. తద్వారా పోలీసు ప్రతిష్ఠను పెంచే పనిలో ఉన్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రజల్లో పోలీసు ప్రతిష్ఠను పలుచన చేస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించి క్షేత్రస్థాయి పరిస్థితులను చక్కదిద్దితేనే ప్రజలకు ఎంతో మేలు.
అందం, డ్రగ్స్ ఆ తర్వాత డబ్బు- విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు - Visakha Honey Trap Case