Spurious Cotton Seeds Selling in Telangana : పత్తి విత్తనాలు బలంగా ఉంటేనే రైతుకు పంట దిగుబడి అధికంగా వస్తుంది. అలాంటి విత్తనాలు కలుషితం చేయడంతోపాటు అసలైన వాటి స్థానాల్లో నిషేధిత, నకిలీ విత్తనాలను కేటుగాళ్లు అమ్ముతున్నారు. వాటిని నిలువరించేందుకు వ్యవసాయ సీజన్ ప్రారంభ దశలోనే పోలీసులు దాడులు ముమ్మరం చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు తయారు చేస్తూ పేరుమోసిన కంపెనీల బ్రాండ్ కవర్లలో వాటిని విక్రయించేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు : దీనికి సంబంధించి పోలీసు శాఖ 2 రోజుల క్రితం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం విడుదల చేసింది. ఒకటికి రెండుసార్లు పరీక్షించుకున్నాకే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించింది. గతేడాది కూడా ఇలాంటి కేసుల్లో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఏదైనా అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు పేర్కొన్నారు.
36 లక్షల సొత్తు స్వాధీనం : ఇటీవల రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీసులు, ఎస్వోటీ పోలీసులతో కలిసి ఎలివెర్తి గేటు సమీపంలో ఆగి ఉన్న ట్రక్కులో నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 14 క్వింటాళ్ల బీజీ-3/హెచ్‌టీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.36 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నెల రోజుల క్రితం శామీర్‌పేట రాజీవ్ రహదారిపై బొలెరో వాహనంలో ఉల్లిగడ్డ సంచుల్లో తరలిస్తున్న12 క్వింటాళ్ల బీటీ-3 నకిలీ పత్తి విత్తనాలను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
ఈ సమయంలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందని నెలల క్రితమే తెచ్చిన వాటిని రహస్య స్థావరాల్లో భద్రపరుస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా కేసు నమోదైన వారిపై పీడీ యాక్ట్ కూడా చేయవచ్చని పోలీసులు వెల్లడిస్తున్నారు. నకిలీలు అరికట్టేందుకు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు నగర శివారు పోలీసులను రాచకొండ కమిషనర్ అప్రమత్తం చేశారు. రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసేముందు ఒకటికి రెండు సార్లు పరీక్షించి తీసుకోవాలని సూచించారు.
రూ.35 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - ఇద్దరు అరెస్టు