YSRCP Leaders Gunmens Removed: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికారపార్టీ అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ నాయకులకు గన్‌మెన్లు, గన్ లైసెన్సులు పోలీసు శాఖ మంజూరు చేసింది. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో దీనిపై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పులివెందులకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా పోలీసులు స్పందించారు. "సెక్యూరిటీ రివ్యూ కమిటీ" నిబంధనలు పాటించకుండా భద్రత కల్పించిన గన్‌మెన్‌లను విత్ డ్రా చేసుకున్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ జిల్లాలోని చోటామోటా వైఎస్సార్సీపీ నాయకులు గన్‌మెన్లు, గన్ లైసెన్సులను దక్కించుకున్నారు. ఓ పెద్ద నాయకుడు సిఫారసు మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులకు గన్‌మెన్లను కట్టబెట్టింది. సాధారణంగా ఎవరైనా తమ ప్రాణాలకు ముప్పు ఉందని జిల్లా పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే దాన్ని సెక్యూరిటీ రివ్యూ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
'భద్రత విషయంలోనూ అధికార దుర్వినియోగమే'
కానీ, 2019 నుంచి నేటి వరకు ఎలాంటి రివ్యూ కమిటీలో చర్చించకుండా జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్సీపీ నాయకులకు భద్రత కల్పించినట్లు తేలింది. ఈ విషయాలపై పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈనెల 12న జిల్లా ఎస్పీతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీలో ఎలాంటి పదవి లేని వారికి సైతం గన్ మెన్లను ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదీ ఎస్ఆర్సీ నిబంధనలు పాటించకుండానే ఇచ్చారని తెలియజేశారు.
ఈనెల 12న రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసు యంత్రాంగం స్పందించింది. జిల్లాలోని 20 మంది వైఎస్సార్సీపీ నాయకులకు కేటాయించిన గన్మెన్లను అప్పటికప్పుడే ఉపసంహరించుకుంది. వీరిలో వేంపల్లెకు చెందిన సభ్యుడు రవికుమార్ రెడ్డికి వన్ ప్లస్ వన్ గన్ మెన్లను కేటాయించారు.
చంద్రబాబు జపం చేయడానికే 'సిద్ధం' సభ పెట్టినట్లుంది: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
అదేవిధంగా పరిశ్రమల శాఖ ప్రభుత్వ సలహాదారుడు రాజోలి వీరారెడ్డికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించారు. జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి నిబంధనలకు విరుద్ధంగానే గన్ మెన్లను ఇచ్చారు. కాశినాయన మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ విశ్వనాథ్ రెడ్డి, కడపకు చెందిన చింతకుంట రమేశ్ రెడ్డి, ముద్దనూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత మునిరాజారెడ్డి, యర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, ముద్దనూరు ఎంపీపీ ప్రదీప్ రెడ్డి, లింగాల మండలం గుణగణపల్లెకు చెందిన సూర్యనారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డికి ఎస్ఆర్సీ నిబంధనలు పాటించకుండా భద్రత కల్పించారు. 20 మంది వైఎస్సార్సీపీ నాయకులకు కేటాయించిన మొత్తం 40 మంది గన్‌మెన్లకు వెనక్కి రావాలని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. వారంతా మంగళవారం నుంచి విధులకు దూరంగా ఉన్నట్లు తెలిసింది.
వీరే కాకుండా ఇంకా చాలామంది వైఎస్సార్సీపీ నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా గన్ లైసెన్సులు మంజూరు చేసినట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట పులివెందులలోనే భరత్ యాదవ్ అనే వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగానే అప్పు చెల్లించలేదనే కారణంతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. వారిలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరగక ముందే పోలీసుశాఖ జాగ్రత్త వహించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ ప్లాన్- టీడీపీ శ్రేణులపై బైండోవర్ కేసులు