Polavaram Residents Solve Their Problems : ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలు తీరడం లేదంటూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 20 ఏళ్లవుతున్నా ఇప్పటివరకూ న్యాయం జరగలేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా సమస్యలు పరిష్కరిస్తుందని ఆశాభావంతో ఉన్నారు.
ఏళ్లు గడుస్తున్నా జరగని న్యాయం : పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన తరగతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంపైనా ఉంచాలని కోరుతున్నారు. ఈ 20 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం 75 శాతం పూర్తికాగా పునరావాస కల్పన 10 శాతం కూడా మించలేదని నిర్వాసితులు చెబుతున్నారు.
సమస్యలు పరిష్కరం : 2022 జులైలో వచ్చిన వరదల్లో 41.5 కాంటూరు పైబడిన గ్రామాలూ మునిగిపోయాయి. ఏలూరు జిల్లాలో పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని 25 వేల కుటుంబాలకు చెందిన లక్ష మంది నిర్వాసితులయ్యారు. వీరిలో అత్యధికులు గిరిజనులే. వీరికి పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పునరావాస కాలనీలు నిర్మించారు. కాలనీలు అయితే నిర్మాణం చేశారు కానీ ఒక్క కుటుంబానికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదు. కాలనీల్లో నిర్మాణం చేసిన ఇళ్లూ నాసిరకంగా ఉన్నాయని నిర్వాసితులు చెబుతున్నారు.
"వరదలు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి సంవత్సరం మా ఇళ్ల మునిగిపోయి గుట్టలపైకి వెళ్లి నెలల తరబడి ఉండాల్సి వస్తుంది. వ్యవసాయం లేదు. సరైన పని కూడా దొరకడం లేదు. పునరాసం కింది నిర్మించిన ఇళ్ల నాసిరకంగా ఉన్నాయి. భూములు ఉన్నా వారికి ఇంకా భూములు ఇవ్వలేదు. ఇచ్చిన వారికి పట్టాలు లేవు. దీనివల్ల రైతు భరోసా రావడం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన మాపై కనికరం చూపాలి"_పోలవరం నిర్వాసితులు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు : కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా 2022లో వచ్చిన వరదలను ప్రామాణికంగా తీసుకొని ముంపునకు గురవుతున్న అన్ని కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. వర్షాకాలం వచ్చింది కాబట్టి గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.