Polavaram Rehabilitation Victim Suicide Attempt: పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్యాయత్నం ఘటన తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. పరిహారం, ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదంటూ ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద 75 ఏళ్ల ఉండమట్ల సీతారామయ్య బలవన్మరణానికి యత్నించారు. బాధిత రైతు స్వగ్రామం దేవీపట్నం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పొలం కోల్పోయిన సీతారామయ్యకు ఇప్పటికీ పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదు.
ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఈ ఉదయం కూడా పోలవరం కార్యాలయం వద్ద పనుందని ఇంట్లో చెప్పి వెళ్లారు. అధికారుల వైఖరి పట్ల విసుగు చెందిన సీతారామయ్య పోలవరం కార్యాలయం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన్ని కార్యాలయ సిబ్బంది రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 48 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపినట్లు సీతారామయ్య కుమారుడు నాగేశ్వరరావు వెల్లడించారు.