Polavaram Fire Case Updates : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ-పరిపాలన కార్యాలయంలో కీలక దస్త్రాల్ని గుట్టుగా కాల్చేసిన వ్యవహారం రచ్చకెక్కింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఐదేళ్ల అక్రమాలు మరోసారి చర్చకు వచ్చాయి. అల్లూరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కింద వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, ఎటపాక, దేవీపట్నం మండలాలున్నాయి. విలీన మండలాల్లో పునరావాస ప్రక్రియ ప్రారంభం కాలేదు.
Papers Fires on Polavaram Office : దేవీపట్నం మండలంలో 44 ముంపు గ్రామాల్లో గిరిజన, గిరిజనేతర కుటుంబాలు ఆరు వేల వరకూ ఉన్నాయి. ఇందులో కొండమొదలు పంచాయతీలోని తాళూరులో కొందరు గిరిజనులు మినహా మిగిలిన గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి. ఖాళీ చేసిన గ్రామాలకు సంబంధించి పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో కొండ పోరంబోకు భూములకు అప్పట్లో నకిలీ డీ ఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి పరిహారం సొమ్ము పక్కదారి పట్టించారు. రెవెన్యూ, ప్రాజెక్టు భూసేకరణ అధికారులు కనీసం దస్త్రాలను పరిశీలించకుండా రాజకీయ నేతలకు దాసోహమయ్యారు.
వైఎస్సార్సీపీ నేతల జోలికి వెళ్లని ప్రభుత్వం : అప్పట్లో పోలవరం భూసేకరణ ప్రత్యేక అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామోజీ, తహసీల్దారు వీర్రాజు, ఆర్‌ఐ బాపిరాజు, వీఆర్వో సత్తార్, సర్వేయర్, మరో ఇద్దరు దళారుల పాత్ర ఉన్నట్లు తేల్చారు. వారిని జైలుకు పంపారు. కొందరి బదిలీలు, మరికొందరి సస్పెన్షన్లతో ఈ వ్యవహారానికి పాతరేశారు. అప్పట్లో చక్రం తిప్పిన స్థానిక వైఎస్సార్సీపీ కీలక నేతతోపాటు దళారుల జోలికి మాత్రం వెళ్లలేదు.
రూ.6.17 కోట్లు స్వాహా : దేవీపట్నం మండలం గుబ్బలంపాలెంలో ఏడుగురు గిరిజన రైతులకు అందాల్సిన రూ.2.20 కోట్ల పరిహారం దారి మళ్లింది. కొయ్యల వీరవరంలోని ఊరకొండ వద్ద 82.37 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి 21 మంది రైతుల పేరుతో రూ.6.17 కోట్లను మింగేశారు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవులో ఉండటం మరికొందరు అందుబాటులో లేకపోవడంతో ఉద్దేశపూర్వక చర్యే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాలినవన్నీ సంతకాలు లేని జిరాక్స్ పత్రాలేనని అధికారులు శనివారమే తేల్చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనాస్థలిని పరిశీలించి అనుమానాలు వ్యక్తం చేశారు. చిత్తుకాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారని నిలదీశారు. ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికిగానీ అధికారులకు జ్ఞానోదయం కాలేదు. అంతా పరిశీలించాక వాస్తవాలు వెల్లడిస్తామని మాట మార్చారు.
Polavaram Project Files Updates : కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల పరిధిలో రూ.4,202 కోట్లతో జరగాల్సిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణ పనులు, భూసేకరణ కూడా ధవళేశ్వరంలోని కార్యాలయమే పర్యవేక్షిస్తోంది. కాల్చివేసిన దస్త్రాల్లో ఈ పత్రాలూ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ ఘటన దుమారం రేపడంతో మన్యంలో భూ పరిహారం అక్రమాల్లో చక్రం తిప్పిన దళారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు దస్త్రాలు దగ్ధం - అధికారులే కాల్చేశారనే ఆరోపణలు - Polavaram Files Burnt