PM Modi Stay in Rajbhavan : లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) ముంగిట ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. నేడు ఆదిలాబాద్‌లో పర్యటించిన ప్రధాని, మంగళవారం రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి పర్యటన నిమిత్తం, మోదీ ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీజీపీ, సీఎస్ సాదర స్వాగతం పలికారు.
PM Modi Telangana Tour : ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండో రోజు పర్యాటనలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9వేల 21కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరి 10.45 గంటలకు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగాణానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి జిల్లాలో రూ. 1,409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా జాతీయ రహదారిని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అదే విధంగా సంగారెడ్డి క్రాస్‌రోడ్డు నుంచి మదీనాగుడా వరకు1298 కోట్ల రూపాయలతో ఎన్‌హెచ్-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న ఎన్‌హెచ్-765D మెదక్-ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12.30 గంటలకు సంగారెడ్డి నుంచి బయలుదేరి వెళ్తారు.
తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం : ప్రధాని మోదీ
ప్రధాని మోదీ(PM Modi), గవర్నర్ తమిళసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డిల రాకతో జిల్లాలోని పటాన్‌చెరు పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెత్తం 2వేల మంది పోలీసు బలగాలతో సభ ప్రాంగాణానికి మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని రాకతో భద్రత దృష్ట్యా సభస్థలానికి 5 కిలో మీటర్ల మేర "నో ఫ్లై జోన్" ఏర్పాటు చేశారు. డ్రోన్ ఎవరు ఎగురవేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రూపేష్ హెచ్చరించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలు, మోదీ అభిమానులు సభప్రాంగాణానికి రావడానికి పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు విధించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్లు, బస్సులు పార్కు చేసుకోవడానికి ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలను కేటాయించారు. ద్విచక్రవాహనాల కోసం మరి కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేశారు. పోలీసులు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే వాహనాలను పార్కు చేసుకోవాలని ఎస్పీ సూచించారు
'కేంద్రంతో లొల్లి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమే - తెలంగాణకు మోదీ పెద్దన్నలా సహకరించాలి'
రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ