PIL on Conocarpus Trees Cutting: కోనో కార్పస్ మొక్కలు, చెట్లను అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మరో ఇద్దరు వ్యక్తులు ఈ పిటిషన్‌ను సమర్పించారు. కోనో కార్పస్ చెట్లతో మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఉందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. నాటడానికి అవి యోగ్యమైనవా? కావా? అనే విషయంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలన్నారు.
కోనో కార్పస్ చెట్లను అక్రమంగా కొట్టేసిన వారి నుంచి వాల్టా చట్టం (Water, Land and Trees Act) ప్రకారం నష్టపరిహారం వసూలుచేసి ప్రత్యామ్నాయ ప్రదేశంలో మొక్కలు నాటేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కోనో కార్పస్ మొక్కలను కొట్టేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
వ్యాజ్యంలో అంశాలు:
- కోనో కార్పస్ మొక్కలనుంచి వెలువడే పుప్పొడితో ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడతారని, అవి ఆక్సిజన్ విడుదల చేయవన్నవి అపోహలు మాత్రమే.
- ఈ చెట్ల గాలి ప్రజల ప్రాణాలకు ముప్పని, జంతువులు సైతం ఆ మొక్కలను తినవని, వాటి వేర్లు భూగర్భంలో వేసిన పైప్‌లైన్లను ధ్వసం చేస్తాయని, ఇలా అనేక విధాలుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.
- ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విరివిగా నాటిన మొక్కలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొక్కలపై ఆరోపణలన్నింటికి ఏ విధమైన సైంటిఫిక్ ఆధారాలు లేవు.
ప్రభుత్వంపైనా బాధ్యత: ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే కారణంతో కోనో కార్పస్ చెట్లను కొట్టేయడాన్ని అధికారులు సైతం ప్రోత్సహిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో 4 వేల 600 కుపైగా చెట్లను కొట్టేశారని ప్రస్తావించారు. నెల్లూరు జిల్లాలోనూ పలు చెట్లను ధ్వంసం చేశారని వెల్లడించారు. చెట్లను పరిరక్షించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని చెట్ల కొట్టివేతను ఆపాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక సీఎస్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, కాకినాడ, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారించనుంది.
కాగా సుమారు 40 దేశాల్లో కోనో కార్పస్ మొక్కలున్నాయి. ప్రతికూల వాతావరణంలోనూ ఈ మొక్క 6 నుంచి 7 అడుగులు పెరిగి హరిత ఆహ్లాదాన్ని పంచుతుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వద్ద, కొన్నిచోట్ల రోడ్డు డివైడర్లపై కోనో కార్పస్ చెట్లు ఉన్నాయి. పర్యావరణాన్ని రక్షిస్తూ వాయు, శబ్ద కాలుష్యాన్ని అరికడుతూ ఎంతో అందంగా ఉంటున్నాయి.
మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection