Perni Nani Family Anticipatory Bail Petition : సొంత గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో ఈ మేరకు పిటిషన్ ఫైల్ చేశారు. కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. పేర్ని నాని తన సతీమణి పేరుతో పౌరసరఫరాల సంస్థకు అద్దెకు ఇచ్చిన గోదాములో అందులో నిల్వ ఉంచిన 3 వేల 708 బస్తాల మేర రేషన్ బియ్యం మాయమయ్యాయి.
ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపై మచిలీపట్నం తాలూకా స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణ నిమిత్తం జిల్లా జడ్జి అరుణ సారిక 9వ అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. న్యాయాధికారి సుజాత ఈ కేసును విచారణ నిమిత్తం ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు.
అజ్ఞాతంలోకి పేర్ని కుటుంబం!: రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో కేసు నమోదైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని కుటుంబంతో పాటు గోదాము మేనేజర్ మానస తేజ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. ఇక అరెస్టు తప్పదన్న భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లారనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుని హోదాలో పేర్ని నాని నేతృత్వం వహించాల్సి ఉంది. కానీ ఆయన కానీ, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన తనయుడు పేర్ని కిట్టు కానీ కనిపించలేదు. దీంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లారన్న అనుమానాలకు బలం చేకూర్చినట్లు అయింది.
ప్రత్యేక పీపీని నియమించాలి: విచారణ నిమిత్తం ముందస్తు బెయిల్ పిటిషన్ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు బదిలీ అయింది. అక్కడ ఏపీపీగా ఉన్న న్యాయవాది పేర్ని నానికి సన్నిహితుడు. వైఎస్సార్సీపీ హయాంలో నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రపై నమోదైన కేసు విచారణ సమయంలో ఏపీపీ రవీంద్రకు అనుకూలమన్న అభియోగం మేరకు ప్రత్యేక ఏపీపీని నియమించారు. ప్రస్తుతం కూడా జయసుధ కేసు విషయంలోనూ ఇదే పద్ధతిని అవలంబించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొనసాగుతున్న విచారణ: పేర్ని గోదాములో మాయమైన 185 టన్నుల బియ్యం వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదైనా పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో నిందితులను అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. గోదాములో 3,708 బస్తాలే పోయాయా? ఇంకా ఎక్కువ పరిమాణంలో ఉందా? ఈ సరకు ఎప్పుడు మాయమైంది? ఇంత భారీ పరిమాణంలో వ్యత్యాసం ఉన్నా తనిఖీల్లో అధికారులు ఎందుకు గుర్తించలేదు? తదితర అంశాలపై కృష్ణా జిల్లా జేసీ గీతాంజలిశర్మ పౌరసరఫరాల శాఖ అధికారులతో సమగ్రంగా విచారణ చేయిస్తున్నారు.
గోదాములో పీడీఎస్ రైస్ మాయం! - మాజీ మంత్రి పేర్నినాని భార్యపై కేసు
'పేర్ని నాని రెట్టింపు జరిమానా కట్టాలి- క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాలి'