People Suffering Due to Heavy Rains in Alluri District : అల్లూరి జిల్లాలో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంపచోడవరం మండలం పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే శిరీష దేవి సొంత ఖర్చులతో జేసీబీ ఏర్పాటు చేసి కొండ చరియల తొలగింపు పనులు చేపట్టారు. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో భూపతిపాలెం జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు మూడు గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు.
శాంతించిన గోదారమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - Godavari Floods in Dhavaleswaram
ప్రమాదకరమైన వాగుపై సాహసం : వర్షాకాలంలో మారేడుమిల్లి మండలం సున్నంపాడు, నూరిపూడి గ్రామాల మధ్య పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నూరిపూడిలో విద్యుత్ సమస్య రావడంతో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదకరమైన పెద్ద వాగుపై వైర్లు కట్టి సాహసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లోనూ తాడు సాయంతో గిరిజనులు వాగు దాటాల్సిన దుస్థితి ఏర్పడింది. వాగుపై వంతెన నిర్మాణం గతంలో చేసిన శంకుస్థాపనతో నిలిచిపోయింది. అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.
మృతదేహాన్ని తరలించేందుకు అవస్థలు : జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డల ఉద్ధృతితో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ శీలంగొంది గ్రామానికి చెందిన బడ్నాయిని పెదడొంబు(67) గురువారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈయన్ను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి సమీపంలోని చంపాపట్టి గెడ్డ వరకు అంబులెన్స్ చేరుకోగా గెడ్డను దాటించి అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధాహ్నం మూడు గంటలకు ఆయన మృతి చెందారు. రాత్రి ఏడు గంటలకు చంపాపట్టి గెడ్డ వరకు అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి బాధిత కుటుంబికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మృతదేహాన్ని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటించారు.
లంకలను ముంచెత్తిన వరద గోదారి - బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు - Godavari Floods in Lanka Villages
ఇంకా ముంపులోనే పలు ప్రాంతాలు : చింతూరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో పాడేరు రెడ్ క్రాస్ బృందం గత ఐదు రోజులుగా సహాయ చర్యల్లో పాల్గొంది. స్థానిక ఎన్ఎస్ఎస్ విభాగంతో కలిసి ప్రజలకు నిత్యవసరాలు సరుకులు పంపిణీ చేశారు. వారి సేవలు కలెక్టర్ అభినందించారు.
వేలు క్యూసెక్కుల నీరు దిగువకు : సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి జలాశయం నుంచి ఒక గేటు ద్వారా రెండు వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో నీటి నిల్వలు తరలిరావడంతో డొంకరాయి జలాశయం నీటిమట్టం ఒక్కసారిగా పూర్తి స్థాయికి చేరుకుంది. జలాశయానికి సుమారు ఎనిమిది వేలు క్యూసెక్కులు నీటి నిల్వలు రావడంతో ఈ పరిస్థతి నెలకొంది. బుధవారం రోజు 1,035 అడుగులు నీటిమట్టం ఉండగా ఏపీ జెన్‌కో ఇన్‌చార్జి ఎస్ ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ విజయ్‌కుమార్‌లు ఆరో నెంబర్ గేటు ఎత్తి రెండు వేలు క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయంలో నీటిమట్టం స్థిరంగా కొనసాగే వరకూ నీటి విడుదల కొనసాగుతుందని ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం గూడెం కాలనీలో శాంబారీ దేవి గుడి వద్దనున్న భారీ మామిడి చెట్టు నేల కూలింది. దీంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. భారీ చెట్టు కుప్పకూలడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.