People Suffering Due to Godavari Floods in AP : గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. కొద్దిరోజులుగా లంకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ప్రజలు అవస్థలు పడుతూ వరద నీటిలో కాలం వెల్లదీస్తున్నారు. వేల ఎకరాల్లో పంటలు నీటిలో నాని కుళ్లిపోతున్నాయి. సుమారు 200 లంకల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.
జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు : గోదావరికి పోటెత్తిన వరద కోనసీమ లంకల్ని ముంచెత్తుతోంది. కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని లంకలను పూర్తిగా వరద నీరు చుట్టుముట్టేసింది. అయినివిల్లి మండలం వెదురుబీడెం కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తోంది. వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక వాసులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
పొట్టిలంక నీటిలో మగ్గుతోంది. ఉద్యానవన పంటలు నీటమునిగాయి. ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, లంక ఆఫ్ ఠానే లంక, కూనాలంకల్లో వరద ప్రవహిస్తోంది. పంటలన్నీ దెబ్బతిన్నాయి. తాళ్లరేవు మండలం గోగుల్లంక, కె. గంగవరం మండలం శేరిల్లంక, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు, లంకలు నీటమునిగాయి. పశుగ్రాసంతో పాటు పశువుని కట్టేసేందుకు లంకవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన- ప్రభుత్వ సహాయ చర్యలపై పరిశీలన - Ministers Visit Floods Areas
కే గంగవరం మండలం కోటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. కోటిపల్లి, సుందరపల్లి వద్ద కోతకు గురైన గోదావరి ఏటిగట్టు పరిశీలించారు. ఏటిగట్లు కోతకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రులు తెలిపారు.
నీటమునిగిన గ్రామాలు : వశిష్ట గోదావరిలో ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరింది. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లోని టేకుశెట్టిపాలెం, అప్పనరాముని లంక, సఖినేటిపల్లి, లాకుపేట, కొత్తలంక, ఓఎన్జీసీ కాలనీ, రామరాజులంక తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి కాజ్‌వేపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడి లంక, కె.ఏనుగుపల్లి లంక, శివాయలంక గ్రామాలు నీటిలో నానుతున్నాయి. స్థానికులు పడవలపైనే రాకపోకలు కొనసాగిస్తున్నారు.
తగ్గని గోదావరి వరద ఉద్ధృతి - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - Godavari floods in ap
బోటు ప్రమాదం : పి.గన్నవరం మండలం ఊడిమూడి లంకకు తాగు నీరు తీసుకెళ్తున్న పడవ వశిష్ఠ గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉడిమూడికి చెందిన విజయకృష్ణ మృతి చెందారు. ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. రోజూ వెళ్లే మార్గంలో కాకుండా వేరే వైపు పడవ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మృతి చెందిన విజయకృష్ణ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
జల దిగ్బంధంలోనే పలు గ్రామాలు - అవస్థలు పడుతున్న ప్రజలు - Godavari floods in ap
అధికారులు ప్రత్యేక దృష్టి : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకలో ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించారు. లంకవాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో కోనసీమ వైపు ఉన్న కనకాయలంక, పుచ్చకాయలంక, అయోధ్య లంక, తదితర లంక గ్రామాలన్నీ ముంపులో మగ్గుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ముంపు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎస్ఈ, డీఈలను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
లంకలను ముంచెత్తిన వరద గోదారి - బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు - Godavari Floods in Lanka Villages