People Suffering Due to Dust Released From RTPP : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విడుదలయ్యే దుమ్ముతో చిన్నదండ్లురు, గోపాలపురం గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. థర్మల్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్మూ, ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నామంటూ సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌టీపీపీ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆర్‌టీపీపీలో మరమ్మతుల నిర్వహణలో లోపం కారణంగానే దుమ్ము, ధూళి విపరీతంగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు. బూడిద నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని (ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు.
దుమ్ము ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. థర్మల్ ప్లాంట్ నుంచి విడుదలవుతున్న కారణంగా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారని యూనియన్ నేతలు అన్నారు. ఆర్‌టీపీపీ నుంచి బూడిద అనేక గ్రామాల్లోకి వస్తుందని దానిని అదుపు చేయాలని యాజమాన్యాలను అభ్యర్థించామన్నారు. థర్మల్ ప్లాంట్లోని మొదటి స్టేజ్లో సరైన పరికరాలు లేకపోవడంతో వాక్యూమ్ వ్యవస్థ సరిగ్గా పని చేయట్లేదని యాజమాన్యం చెప్పినట్లు యూనియన్ నేతలు పేర్కొన్నారు. దాని వల్ల దుమ్ము, ధూళి గ్రామాలపై పడుతుందన్నారు.
ఎర్రగుంట్ల మండలంలోని గ్రామాలను ముంపు ప్రాంతాలుగా పరిగణించి తమకు ప్యాకేజీ ప్రకటించి వేరే చోట పునరావాసం కల్పించాలని నేతలు కోరుతున్నారు. బూడిద కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. సామాజిక భద్రతగా ఆర్‌టీపీపీ యాజమాన్యం అనారోగ్యానికి గురైన వారికి వైద్య సదుపాయం కల్పించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. థర్మల్ ప్లాంట్ నుంచి విడుదల అవుతున్న బూడిద గాలికి ఇళ్లలోకి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన చేస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు.
భారతి సిమెంట్ వాహనాలతో అనారోగ్య సమస్యలు - మహిళల ఆందోళన - Protest on Vehicles Dust Problem